నెల్లూరు , (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సోమవారం ఎన్నికలు జరిగాయి . అయితే పోలింగ్ తక్కువ శాతం నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉన్నప్పటికీ అధికార పార్టీకే కొంత అనుకూల వాతావరణం కనబడుతోంది . ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్వయంగా పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కేంద్రం ద్వారా పర్యవేక్షించారు. అలాగే జిల్లా ఎస్పీ విజయరావు కూడా పలు కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించడం జరిగింది. పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా .. బ్యాలెట్ బాక్సులను కూడా భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.
పోలింగ్ సమయం ముగిసేసరికి 52 శాతం దాటలేదు. సాయంత్రం 5 గంటలకు తుది సమయం ముగిసేసరికి పోలింగ్ శాతం 50.01గా మాత్రమే నమోదైంది. అయితే అప్పటికే కొంతమంది ఓటర్లు క్యూ లైన్ల లో ఉండడంతో ఆయా పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు. 5 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి హాజరైన వారందరికీ ఓటు హక్కు కల్పించే క్రమంలో పోలింగ్ శాతం పెరిగింది. నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో 4 లక్షల 12 వేల 239 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు 2 లక్షల 6 వేల 160 మంది పోలింగ్ కేంద్రాలకు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్, ఇద్దరు ఉప మేయర్లు, బుచ్చి నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్ , ఇద్దరు చొప్పున వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఈనెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం పోలింగ్ జరగగా , బుధవారం కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి . ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఎక్కడైనా 22న ఎన్నికలు నిర్వహించని పక్షంలో 23న విధిగా పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా , ఈ నెల 17న కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం జరగనుండగా , అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ చక్రధర్ బాబు సూచనల మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది .
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily