Wednesday, November 20, 2024

NZB: నయనానందకరం…. మహా గంగా జలాభిషేకం…

అంగరంగ వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు…
శంభుని ఆలయం నుంచి కలశాలతో భారీ ర్యాలీ..
కన్నుల పండుగగాఅమ్మవారికి జలాభిషేకం..
ఘనంగా కుంకుమార్చనలు…
అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి…
రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత..

నిజామాబాద్ ప్రతినిధి, జులై 12( ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో… ఆషాడ మాస మహా గంగా జలాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ బాసర నుండి గంగా జలాన్ని తీసుకువచ్చారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గంజి ప్రాంతంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాడ మాస మహాగంగ జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ సతీమణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సతీమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలోని హైమాది బజార్ ప్రాంతంలో గల శంభు లింగేశ్వర ఆలయం నుండి వందల సంఖ్యలో కలశాలతో గంగా జలాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అమ్మవారి నామస్మరణతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారి, ముఖ్య అతిథులు, కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి గంగా జలాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సుహాసినీలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పోరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ… కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. వైశ్య కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఇందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులు సమాజసేవ కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ (వాసు)గుప్తా, ప్రధాన కార్యదర్శి పాల్తి రవికుమార్ గుప్తా, కోశాధికారి పార్సి రాఘవేంద్ర గుప్తా, కన్వీనర్స్ యాంసాని రవీందర్ గుప్తా, అర్వపల్లి బాల శేఖర్ గుప్తా, పార్సి రాజారాం గుప్తా, మూడ శ్రీనివాస్ గుప్తా, ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement