న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుబులు రేపుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ ముప్పు నేపథ్యంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని జగన్ ప్రధానితో చెప్పారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్, బుధవారం మధ్యాహ్నం గం. 12.30 సమయంలో ప్రధానిని ఆయన నివాసంలోనే కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం గం. 2.00 సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఆయన నివాసంలో జగన్ కలిశారు. వివిధ ప్రాజెక్టులకు పెండింగులో ఉన్న పర్యావరణ అనుమతుల గురించి ఆయన చర్చించారు.
ఈ భేటీ అనంతరం కేంద్ర పెద్దలతో జరిగిన చర్చ, ముఖ్యమంత్రి అందజేసిన వినతి పత్రాలపై సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు దాటిందని గుర్తుచేసిన సీఎం, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై గతంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమైందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 కు సంబంధించిన రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.
గత ప్రభుత్వ రుణాలు – మాకు శాపాలు
గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోవాల్సిన రుణాలపై పరిమితి విధిస్తోందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఆంక్షలు విధిస్తూ ఈ ప్రభుత్వాన్ని శిక్షిస్తోందని తెలిపారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు.
పోలవరం అంచనా వ్యయం సంగతి తేల్చండి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి చెప్పారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన్ను కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశంకూడా ఇంకా పెండింగులోనే ఉందని గుర్తుచేశారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.55,548 కోట్లు ఖర్చవుతుందని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేసిన సీఎం, తాగునీటి సరఫరా అంశాన్ని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా తాగునీటి వ్యవహారాన్ని ప్రాజెక్టులో అంతర్భాగంగానే చూశారని గుర్తుచేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వారీగా చూస్తున్నారని, తద్వారా బిల్లులను తిరిగి చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. తద్వారా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు, నిర్మాణ వ్యయం కూడా తదనుగుణంగా పెరుగుతూ పోతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని సీఎం జగన్ కోరారు. దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని, అక్రమాలకు తావులేకుండా ఉంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఆలస్యమయ్యేకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని సీఎం తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ డబ్బు మంజూరు చేసినట్టైతే భూసేకరణ, పరిహారం, పునరావాసం పనులు సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
విద్యుత్ బాకీలు ఇప్పించండి
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రిని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థలకు ఈ బకాయిల నిధులు చాలా అవసరమని తెలిపారు.
జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్ కూడా ఏకీభవించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, తద్వారా రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ప్రధానికి వివరించారు. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని వివరించారు.
మరోసారి ప్రత్యేక హోదా ప్రస్తావన
రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా చాలా అవసరమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించారు.
మరోవైపు రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 వైద్య కళాశాలతో కలిపి ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని, మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలని ప్రధానిని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. అలాగే కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయండి .. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన సీఎం జగన్
రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీంకు అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను సీఎం జగన్ కోరారు. కరవుతో అల్లాడే రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు అమలుపర్చాల్సిన ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నుంచి తనకున్న వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022–22, 2022–23 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్రం సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1తేదీ నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందని సీఎం జగన్ తెలిపారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయడంతో పాటు కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్ కూడా లేకుండానే ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని అన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని తాను గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని, ఈ కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై మహానగరానికి తాగు నీరు అందించడంలో విఫలమవుతున్నామని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని సీఎం గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల కారణంగా రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని తెలిపారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని టీజీపీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామని తెలిపారు.
తెలంగాణా ప్రభుత్వం నిబంధనలు మరియు ప్రోటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి నీటిని విడుదల చేయడంతో అనుసరిస్తున్న అనుచిత వైఖరిని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మరింత ప్రమాదంలో పడకుండా నివారించవచ్చునని, అంతకుమించి ఒక్క ఎకరా అదనపు ఆయుకట్టు కల్పించడంతో పాటు, ఒక్క చుక్క అదనపు నీటి నిల్వను కూడా పెంచడం లేదని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయని చెప్పారు. అందుకు అవసరమైన మొత్తం సమాచారం కూడా ఇప్పటికే అందించామని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, మరియు ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జెడ్) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు ఇది కూడా కేవలం ప్రధాన కాలువకు పూర్తి స్ధాయిలో నీటిని అందించడం కోసమేనని చెప్పారు. వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
పోర్టులకు పర్యావరణ అనుమతులివ్వండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తోందని సీఎం జగన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తీరప్రాంతంలో సుమారు 10 లక్షల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధిగా చేపలు పట్టడంతో పాటు, మత్స్య అనుబంధ కార్యకలాపాలపై ఆధాపడి ఉన్నారని, ఈ బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్భర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చిందని చెప్పారు. రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్ట్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు అవసరమై, దరఖాస్తు చేశామని గుర్తుచేశారు. ఈ పనులను ఏపీ ప్రభుత్వం వీలైనంత వేగంగా ప్రారంభించేందుకు అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు.
పంప్డు స్టోరేజీ ప్రాజెక్టులు
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు నిల్వలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టందని సీఎం జగన్ తెలిపారు. 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్య సాధనకు ఇది ఉపయోగపడుతుందంటూ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం పాలసీని కూడా రూపొందించిందని తెలిపారు. ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. వైఎస్‌ఆర్ జిల్లా గండికొట వద్ద 1,000 మెగావాట్స్ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపించిందని చెప్పారు. ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులు కూడా సకాలంలో ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు (1,350 మెగావాట్లు) సామర్ధ్యంతో చేపడుతోందని, వీటికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కోసం దరఖాస్తు చేశామని, రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.