Tuesday, November 26, 2024

TG | అట‌వీశాఖ అధికారుల‌తో మంత్రి కొండా సురేఖ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ శాఖ అధికారుల‌తో మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్ విధివిధానాలను వివరించ‌గా… ఆయా ప్రాంతాల్లో ఎకో టూరిజంను అభివృద్ధి చేయడంపై పలు సూచనలు చేశారు.

కాగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని నాలుగు గ్రామాలను పునారావ కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా అటవీ అధికారులు మంత్రి వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ.. పునరావాస చర్యలు విజయవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని.. రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ‘స్టేట్ లెవల్ కమిటి ఫర్ మిటిగేటింగ్ హ్యూమన్ యానిమల్ కాంఫ్లిక్ట్’తో పూర్తిస్థాయి చర్చల తర్వాత పరిహారం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకతను చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల – దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో.. ప్రస్తుతం పర్యాటక సేవలు అందిస్తున్నట్లు మంత్రి సురేఖకు వివరించారు.

సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట- శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్‌లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇక‌, పెరుగుతున్న పులుల ఆహార లభ్యతకు అనుగుణంగా.. జింకల సంఖ్యను పెంచే దిశగా అటవీశాఖ చేపడుతున్న చర్యలపై మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement