Friday, November 22, 2024

TG: ప‌ర్యాట‌కానికి పెద్ద‌పీఠ‌.. మంత్రి జూప‌ల్లి

ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లా బ్యూరో, ప్రభ న్యూస్ : రాష్ట్రంలో పర్యాటక రంగంతో పాటు, అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద, అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహబూబ్ నగర్ పిల్లలమర్రి వృక్షాన్ని బుధవారం మంత్రి ప్రారంభించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ… టూరిజం అభివృద్ధి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని మధ్య ఆషియా దేశాల్లో సైతం పర్యాటక రంగం ద్వారా జాతీయ ఆదాయాన్ని పొందుతున్నారని, జీవన ప్రమాణాలు సైతం బాగున్నాయని, అలాంటిది ప్రత్యేకించి భారతదేశం లాంటి చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న దేశంలో, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి మహబూబ్ న‌గర్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయని, వీటన్నింటిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా టూరిజం ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, టూరిజంకు మార్కెట్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో వారానికి ఒక రోజు కనీసం ఆహ్లాద వాతావరణాన్ని పొందాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా టూరిజం ద్వారా వారికి ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మంచి అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

మహబూబ్ న‌గర్ సమీపంలోని పిల్లల మర్రి మహావృక్షం మొదలు ఎక్కడుందో ఇప్పటివరకు ఎవరూ గుర్తుపట్టలేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలను కల్పిస్తామని, ముఖ్యంగా పిల్లల మర్రి వద్ద రెస్టారెంట్, లాండ్ స్కేప్ టాయిలెట్స్, పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా మొదటి విడతన మహబూబ్ న‌గర్ నుండి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నామని, ఇందులో భాగంగా తక్షణమే 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

- Advertisement -

ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లాలో నల్లమల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల, ఫర్హాబాద్ వ్యూ పాయింట్ వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని, అంతేగాక సరళా సాగర్, కోయిల్ సాగర్, మన్నెంకొండ, కురుమూర్తి వంటి దేవాలయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వీటన్నిటిని కలిపే విధంగా టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి కలిగిన కృష్ణానది ఉందని, కృష్ణా తిరుగు జలాల్లో వాటర్ స్పోర్ట్స్ తో పాటు, బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి టూరిజం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు మంచి అవకాశాలున్నాయని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయని రామప్ప, పాండవుల గుట్ట, గోల్కొండ కోట వంటి ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు, రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని ఎకో టూరిజాన్ని సైతం అభివృద్ధి చేస్తామని, అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని, టూరిజంలో ఉన్న నిరర్ధక ఆస్తులు అన్నింటిని అందుబాటులోకి తీసుకొస్తామని, టూరిజం ఆదాయాన్ని పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్, జిల్లా పర్యాటక ఇంచార్జ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement