కొందరు వ్యక్తుల పట్ల వివక్ష అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో వస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతగా ముందుకు వెళ్తున్నా కొందరి ధోరణి మాత్రం ఏ కోశానా మారడం లేదు. కాగా హైదరాబాద్ లోని ఓ హౌసింగ్ సొసైటీలో పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ లిప్ట్ ఎక్కితే జరిమానా తప్పదని బహిరంగంగా నోటీసుని అంటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ లిఫ్ట్ వద్ద ఉన్న నోటీసులో.. ఇళ్లలో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్ ఈ లిఫ్ట్ వినియోగిస్తే రూ. 300 జరిమానా విధించనున్నట్టుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను హర్ష వడ్లమాని అనే ఇండిపెండెంట్ ఫొటో జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 2022లో సైబరాబాద్ ఇలా ఉందనే అర్థం వచ్చేలా Cyberabad, 2022 అని పేర్కొన్నారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మన ఇంటి పనులు చేసేవారిపై, మనం బయటకు వెళ్లేటప్పుడు కారులో తీసుకెళ్లేవారిపై, మనం ఆర్డర్ చేస్తే ఫుడ్ తెచ్చేవారిపై ఇలాంటి వివక్ష ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయ్యో!! వారు మీ ఇళ్లలోకి వచ్చి మీరు వంటలు చేసే పాత్రలు, మీరు ధరించే బట్టలు శభ్రం చేయడానికి ముట్టుకోవచ్చు. డెలివరీ బాయ్స్ మీరు తినే ఆహారాన్ని తీసుకురావచ్చు.. డ్రైవర్లు కారులో మీ పక్కన కూర్చోవచ్చు.. కానీ వారు “మెయిన్” లిఫ్ట్‌లోకి వెళ్లలేరు? మెడికల్ మాస్క్‌తో ముఖానికి మాస్క్ చేయండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఎందుకిలా అంటే కరోనా జాగ్రత్తలు అంటున్నారు అపార్ట్ మెంట్ వాసులు. మరి వారికి వారే సొంతంగా అన్ని పనులు చేసుకోవచ్చుగా అంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..