అరణ్యవాసం గడుపుతూన్న పాండవులను ఒకసారి చూ సి, పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకుని వెళ దామని వచ్చిన మార్కండేయ మహర్షితో, ధర్మరాజు తన మనసులోని బాధను ఇలా వెళ్ళబోసుకుంటాడు.
కడఁగి ధర్మముతోడ నడచుచు నే మిట్లు
దందడి దు:ఖంబుఁ బొందుటయును
నేపున నెప్పుడు పాపంబు సేయుచు
ధృతరాష్ట్రజులు సుఖోన్నతులగుటయుఁ
గని యవ్విపర్యయమునకు నేనూహంతుఁ
బాయక నరుఁడిప్డు సేయు కర్మ
మున ఫల మిందుఁ బొందునొ? పరలోకంబు
నందుఁ బొందునొ? యిందునందుఁ గనునొ?
విశ్వకర్మయైన యీశ్వరుఁ గానని
పురుషుఁ గర్మఫలము పొరయకున్నె?
యొడలితోనఁ గతము వెడలి పోవునొ? యిది
దెలియవలయునాకు నలఘుపుణ్య!
(ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం)
‘ఎల్లప్పుడూ ప్రయత్న పూర్వకంగా ధర్మవర్తనులమై జీవనం గడుపుతున్న మేము ఇలా దు:ఖాల పాలవడం, కావాలని మాకు అన్నిరకాల కీడును కలగజేస్తూ, ఎన్నో ఇబ్బందులకు మమ్మలను గురిచేస్తూ పాపకర్మలను చేస్తున్న ధృతరాష్ట్ర కుమారులైన దుర్యోధనాదులు సదా సుఖాలను అనుభవిస్తూండడం చూసి, ఆ విపరీతం నా మనసును కలత పెట్టగా, నేను ఇలా అనుకుంటూ ఉంటాను- మానవుడు తాను చేసే పాపకర్మలకు ఫలితం ఇక్కడే, అన గా ఈ లోకంలోనే అనుభవిస్తాడా? లేక పైలోకంలో అనుభవిస్తాడా? అలాకాకుం డా ఈలోకంలో కొంత పైలోకంలో కొంతగా అనుభవిస్తాడా? అని. మంచిపనైనా, చెడుపనైనా… చేసిన కర్మల యొక్క ఫలం ఆ మనిషికి ఎప్పటికైనా చెందకుండా ఉంటుందా? కర్మఫలం అన్నది ఈ శరీరం నశించడంతోనే నశించిపోతుందా? అని. ఈ సందేహాలకు నాకు సమాధానాలు కావాలి’ అని ధర్మరాజు మార్కండేయ మహామునిని అడిగిన ప్రశ్న పై పద్యం.
ఎఱ్ఱన రచించిన భారత భాగం, అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం, 168వ పద్యం ఇది. ఆంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం 142వ పద్యం నుండి చెదలవాడ ఎఱ్ఱన కృతంగా చెప్పబడింది. మహాభారతం ఒకానొకప్పటి కాలంలో జరిగిన మనుషుల కథే తప్ప, ఎవరో మానవాతీతులైన మహమాన్వితు ల కథ కాదు అని ఇలాంటి సందర్భాలే మనకు గుర్తుచేస్తాయి. ఇందులో ధర్మరాజు సందేహాలన్నీ, తెలిసి ఎవరికీ ఏ కష్టమూ కలిగించకుండా, తన బ్రతుకేదో తాను బ్రతికుతున్నప్పటికీ, చుట్టుముట్టి బాధిస్తున్న కష్టాలను తట్టకోలేక సతమతమైపో తున్న ఒక కాలాతీతుడైన మామూలు మనిషి ఆలోచనల్లానే వుంటాయి. ఒక కాలానికి, ఒక యుగానికి అనే పరిమితి లేకుండా, సర్వ కాలాలలోనూ ఈ మామూ లు మనిషి వుంటాడు కాబట్టి, ఈ సామాన్యుడైన మనిషి కాలాతీతుడు. ఇతడి వ్యధలనే మానవకోటి కథలుగా చెప్పుకుని తాదాత్మ్యం చెందుతూ, అప్పటికి సేదదీరి, కాలంలో మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుంటుంది అనిపిస్తుంది.
ధర్మరాజు ధర్మచింతనను ఆప్యాయంగా విన్న మార్కండేయ మహర్షి, అందులోని ధర్మసందేహానికి విశదంగా సమాధానమిస్తూ, ఆ సమాధానంలో భాగంగా ఈ క్రింది మాటలను చెబుతాడు.
విను మనుజున కెవ్విధమునఁ
దనజేసిన సుకృత దుష్కృతంబులు నెఱయం
దన కనుభవింపఁ బాలివి;
తనువు సెడుంగాని కర్మతతి సెడ దనఘా!
(ఆంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం, 171వ పద్యం)
‘ఏవిధంగా చూసినా మానవునికి తాను చేసినట్టి మంచి పనులు, చెడు పనుల ఫలితం పూర్తిగా తానే అనుభవించడానికి వీలయే విధంగా నిర్ణయించబడి వుం టుంది. శరీరం నశించిపోతుంది కాని చేసిన కర్మల సముదాయం, వాటి ఫలితం ఎప్పటికీ నశించిపోదు’ అని పై పద్యం భావం. ఆంధ్ర మహాభారతాన్ని గురించి చెప్పుకునేటప్పుడు అది సంస్కృత భారతానికి అనువాదమనీ, సంక్షిప్తానువాద మనీ, భావానువాదమనీ… ఇలా రకరకాల పేర్లతో చెప్పుకుంటూంటాం. వ్యాసుని మహాభారతంలోని భాగాలను కూడా అప్పుడప్పుడూ చదవడం చేస్తే, ఈ మాటల లో ఏది తెలుగు భారతంలో కవిత్రయ రచనా విధానానికి ఎంతవరకు వర్తిస్తుందో అర్ధమవుతుంది. పై పద్యంలోని భావానికి సరిగ్గా సరిపోయే భావంతో శ్లోకం వ్యా స భారతంలో లేదు. ఎఱ్ఱన స్వతంత్రంగా సమకూర్చి పెట్టిన పద్యాలలో ఇది వొకటి. ఈ పద్యానికి మూలమైన వ్యాసభారతంలోని శ్లోకాలు ఈ క్రిందివి.
తత్రాస్య స్వకృతం కర్మ ఛాయేవానుగతం సదా
ఫలత్యథ సుఖార్హో వా దు:ఖార్హో వాథ జాయతే|
కృతాంతవిధిసంయుక్త: స జంతుర్లక్షణౖ: శుభై:
అశుభైర్వా నిరాదానో లక్ష్యతే జ్ఞాన దృష్టిభి:||
(వ్యాసభారతం, వనపర్వం, 183వ అధ్యాయం, 78,79 శ్లోకాలు)
‘మానవునికి తన పూర్వజన్మలలో చేసిన పాపాలు నీడలలాగా సదా అతని వెనుకనే అనుసరిస్తూ సమయానుకూలంగా ఫలితాలను అందిస్తూ వుంటాయి. అందువలన ప్రతి మనిషీ సుఖాలనూ దు:ఖాలనూ పొందడానికి యోగ్యుడై జన్మ ను ధరిస్తాడు. యమధర్మరాజుచే నిర్ణయించబడిన నియమానుసారంగా, ఏ ప్రాణి కూడా తాను చేసిన కర్మల ఫలితంగా సంప్రాప్తమయే శుభాశుభాలను నియంత్రించ గలిగే సమర్ధత కలిగి వుండదు. జ్ఞానదృష్టితో చూడగలిగే మహాత్ముల ద్వారా మాత్రమే ఇది అర్ధం చేసుకోబడుతుంది’ అని పై శ్లోకాల భావం.
పై శ్లోకాలలోని భావానికి ఎఱ్ఱాప్రగడ చేసినది అత్యంత సరళమైన, అర్థవంత మైన సంక్షిప్తీకరణ అన్నది తెలిసిపోతుంది. అందులో కూడా తనువు సెడుంగాని కర్మతతి సెడ దనఘా!’ అనేవి రత్నముల వంటిమాటలు.ఆ మాటలు అచ్చంగా ఎఱ్ఱాప్రగడవి. శరీరం నశింపుకు గురి అవుతుంది కాని, ఆ శరీరంతో మనిషి చేసే కర్మల సముదాయానికి, వాటి ఫలితానికి నశింపు వుండదని ఆ మాటల భావం. అనశ్వరంగా వెంటాడుతూ వుండేదే కర్మఫలం!