ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వివాదాలతోనే మార్మోగుతోంది. గత కొంతకాలంగా అమె సోషల్‌మీడియాలో పోస్ట్ లతో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంగనా చేసిన వరుస ట్వీట్లు తీవ్ర దుమారం రేపాయి. బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన అల్లర్లపై ట్విట్టర్‌లో మమత బెనర్జీని విమర్శిస్తూ ఆమె పోస్టులు చేయడంపై వివాదం చెలరేగింది. దీంతో ట్విట్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ కంగనా పోస్టులు పెట్టినందుకు.. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధించింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ కూడా కంగనాకు షాక్ ఇచ్చింది.
రెండు రోజుల క్రితం కంగనాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తాను యోగా చేస్తున్న ఫోటోని కూడా ఆమె జత చేసింది. దీంతో పాటు ఇందులో కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుంటుందని.. దాన్ని త్వరలోనే అంతం చేస్తానని ఆమె పేర్కొంది. కోవిడ్ అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఈమె పోస్ట్ పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోసారు. కరోనాను కంగనా తేలికగా తీసుకుందని.. ఈమె పోస్ట్ చూసినవాళ్లు అందరు కరోనాను తేలికగా తీసుకుంటారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రతీ రోజు దాదాపు 4 వేల మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా గురించి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు కంగనా చేసిన ఈ పోస్ట్ ని ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది.
ఈ విషయాన్ని కంగనా స్టోరీ ద్వారా వెల్లడించింది. ‘‘కోవిడ్‌ను నేను నాశనం చేస్తాను అంటూ పోస్ట్ చేస్తే కొందరు హర్ట్ అయ్యారట. అందుకే ఇన్‌స్టాగ్రామ్ నా పోస్ట్‌ని తొలగించింది. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు, కమ్యూనిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్‌లో విన్నాను. కానీ, ఇక్కడ కోవిడ్ ఫ్యాన్ క్లబ్ ఉంది. అద్భుతం. ఇన్‌స్టాకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. కానీ, ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని నాకు అనిపించడం లేదు’’ అంటూ కంగనా పోస్ట్ చేసింది.