తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ తాను రాసిన లేఖపై కేంద్రం స్పందించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు. తన అభ్యర్థన పట్ల కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ సానుకూలంగా స్పందించి బదులిచ్చారని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడి విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి నీట్ పరీక్ష రాసే బాధ తప్పుతుందని చెప్పారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్ సర్కార్… విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో కాకినాడలో నీట్ పరీక్ష కేంద్రం అంశాన్ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీయే)కి నివేదించామని, ఎన్టీయే ఈ అంశాన్ని పరిశీలిస్తోందని అన్నారు. 2022 నీట్ సమయంలో కాకినాడ పరీక్ష కేంద్రం అంశాన్ని కూడా నీట్ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు. ఏపీలో ఇప్పటివరకు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తెనాలి, నరసరావుపేట, కర్నూలు, గుంటూరు, మంగళగిరి, మచిలీపట్నం ప్రాంతాల్లో నీట్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.