మెల్బోర్న్ – బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు వెంటవెంటనే ఆరు వికెట్లను పడగొట్టింది. టీ విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 240 పరుగులు లీడ్ లో ఉంది.
ప్రారంభ ఓవర్లల్లో పేస్ బౌలర్లిద్దరూ చెలరేగారు. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచారు.9 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఇన్నింగ్ ఎక్కువ సేపు కొనసాగలేదు. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.
వికెట్ల పతనం ఆస్ట్రేలియా ఇన్నింగ్‌లోనూ కొనసాగింది. టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను బుమ్రా, ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.ఆ తరువాత వికెట్ల పతనానికి ఎక్కడే గానీ బ్రేకులు పడలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టాడు.
సామ్ కొన్‌స్టాస్- 8, ఉస్మాన్ ఖవాజా- 21, స్టీవెన్ స్మిత్- 13, ట్రావిస్ హెడ్- 1, మిఛెల్ మార్ష్- 0, వికెట్ కీపర్ బ్యాటర్- అలెక్స్ క్యారీ- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు.మొత్తంగా 148 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. మార్నుస్ లాంబుషేన్ ఒక్కడే ఒంటరి పోరాటం సాగిస్తోన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజ్‌లో నిలిచాడు. అర్ధసెంచరీకీ చేరువ అయ్యాడు. 46 పరుగుల మీద లాంబుషేన్, పాట్ కమ్మిన్స్ ప్రస్తుతం క్రీజ్‌లో నిలిచారు.
250 పరుగుల ఆధిక్యతలో ఉంది ఆస్ట్రేలియా.బుమ్రా నాలుగు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఏ ఒక్కర్నీ కుదురుగా ఉండనివ్వలేదు. ఊపిరి సలపనివ్వని విధంగా బంతులను సంధించాడు. ఈ క్రమంలో 200 వికెట్ల మైలురాయిని సైతం అందుకున్నాడీ వరల్డ్ బెస్ట్ బౌలర్. అతి తక్కువ ఇన్నింగ్‌లల్లో ఈ ఫిగర్‌ను దాటాడు. మరో ఎండ్‌లో మహ్మద్ సిరాజ్ కూడా చెలరేగుతున్నాడు. రెండు వికెట్లు కూల్చాడు.