ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: ఫాల్గుణ మాసంలో వచ్చే రంగుల పండగ ‘హోలీ’. ఈ పండగ సమయంలో చిన్నారుల జాజిరి పాటలు తెలంగాణ పల్లెల్లో ఏరులై పారుతాయి. కాముని పున్నమి నేపథ్యంలో 9 రోజుల పాటు ‘జాజిరి’ ఆడటం తరాలుగా వస్తున్న సంప్రదాయం. చిన్నారులు, యువకులు కర్రలు చేతబూని కోలాటాలాడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతారు. ఇంటింటికీ తిరుగుతూ కాముని ఆటలు ఆడుతారు. తేలికైన పదాల్లో గొప్ప సందేశం ఇవ్వడం, ఆ అర్థాన్ని సున్నితమైన హాస్యంతో మిళితం చేసి చెప్పడం జాజిరి పాటలకే సొంతమైన ప్రత్యేకత.
కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి చిన్నారులు వినూత్నంగా జాజిరీ ఆడారు. చిల్లర లేదని అందరూ చెబుతున్నారని గ్రహించిన చిన్నారులు క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్స్ పై దృష్టి సారించారు. ‘క్యూఆర్ కోడ్’ ద్వారా డబ్బులు వసూలు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నారు.