హనుమ, ఇంద్రజిత్తు మధ్య జరిగిన భీకర యుద్ధం లో, ఇంద్రజిత్తు హనుమంతుడిని ”బ్రహ్మాస్త్రం”తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్రబంధాలు తెగిపోయాయి. బ్రహ్మా స్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపొయి నట్లే! ఇంద్రజిత్తు ఆలోచన చేస్తున్నప్పుడే, రాక్షసులు కోతిని తాళ్లతో కట్టి, కట్టెలతో కొడుతూ పిడికిళ్లతో గుద్దుతూ తీసుకుని పోయి, రావణుడి ముందర నిలబెడ్తారు. ”తెచ్చాం కోతిని” అంటారు. వెంటనే ఆ సభలో వున్నవారందరూ ”వీడెవడు? ఎక్కడనుండి వచ్చాడు? ఎవరు పంపారు? ఏ పనుండి వచ్చా డు? ఎందుకిలా చేసాడు?” అనుకుంటుంటే, ”కట్టేయండి, కొట్టండి, కాల్చండి, మింగండి” అంటున్నారు. అవి వింటూ హనుమంతుడు, రావణుడి సభా మంటపాన్ని చూసాడు. హనుమంతుడిని రావణుడు చూసాడు. రావణుని చూసి ఆశ్చర్యపోయిన హనుమ ”ఏమి రూపం, ఏమి తేజం, ఏమి బలం, ఏమి ధైర్యం” అనుకుంటాడు. రాజులకుండాల్సి న చిహ్నాలన్నీ వున్నాయే, ఇట్టి వాడు ధర్మవిరుద్ధ పనులే చేసి వుండకపోతే, స్వర్గాన్ని కూడా తన శక్తియుక్తులతో పరిపా లించేవాడు కదా! అని భావిస్తాడు. ఎదురుగా వున్న ఆంజనేయుడిని, ఎగాదిగా చూసి ఆలో చనలో పడ్డాడు రావణుడు. కైలాస పర్వతాన్ని పెళ్లగించిన ప్పుడు, తనను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చై నా వుండాలి లేదా, తన శత్రు పక్షంలోని బాణుడన్నా కోతి రూపంలో వచ్చి వుండాలి అనుకుంటాడు. లంకకి ఏ పనిమీద వచ్చాడు? వీడిని పంపిందెవ్వరు? ఉద్యానవనాన్ని ఎందుకు పాడు చేసాడు? రాక్షస స్త్రీలనెందుకు బెదిరించాడు? యుద్ధ మెందు కు చేసాడు? ఈ విషయాలన్నీ అడగమని తన ముఖ్యమంత్రి అయిన ప్రహస్తుడిని ఆజ్ఞాపించాడు.
వెంటనే అతడు ఆంజనేయుడిని ప్రశ్నిస్తాడు. భయపడ వద్దనీ, నిజం చెప్పితే వదిలిపెట్తామనీ, అసత్యం చెప్తే ప్రాణాలతో వదలమనీ, ఎవరు తమ రాక్షస నగరానికి పంపించారని ప్రశ్నిస్తాడు ప్రహస్తుడు. ప్రహస్తుడి ప్రశ్నలకు తానే ఆకారంలో కనిపిస్తున్నాడో, ఆ జాతివాడినేననీ, దుర్లభమైన రాక్షస రాజు దర్శనంకోరి ప్రమదావనాన్ని పాడు చేసాననీ అన్నాడు. యుద్ధం చేయడా నికి రాక్షసులొస్తే తన్ను కాపాడుకోవటానికి మాత్రమే వారితో పోరాడానంటాడు. తనను ఎవరు కూడా అస్త్రాలతో కట్టెయ్య లేరనీ, తానే కావాలని పట్టుబడ్డాననీ చెప్పాడు. ”బ్రహ్మ చేత నీవొక్కడివే వరాలు పొందలేదు. నేను కూడా ఇట్టి వరాలు పొందినవాడినే. రాక్షస రాజును చూడగోరి బ్రహ్మాస్త్రానికి పట్టు బడ్డాను. రాక్షసులు నన్ను తాళ్లతో కట్టినప్పుడే ఆ అస్త్ర బంధా లూడిపోయాయి” అంటాడు. శ్రీరామచంద్రమూర్తి బంటు ననీ, రాక్షస రాజుకు కొన్ని క్షేమకరమైన మాటలు చెప్తా విన మనీ హచ్చరికగా అంటాడు హనుమంతుడు. ”సుగ్రీవుడి ఆజ్ఞానుసారం నిన్ను చూడటానికి ఈ పట్టణా నికి వచ్చాను. నీ తమ్ముడు వానర రాజు, సుగ్రీవుడు నీ కుశల వార్త అడిగాడు. నీకు ఇహపరాలలో సుఖం కలిగించే ధర్మ వాక్యాలను చెప్పి పంపాడు. చతురంగ బలాలున్న దశరథు డనే మహారాజున్నాడు. అతడి పెద్దకొడుకు పేరు శ్రీరామచం ద్రుడు. తండ్రి ఆజ్ఞప్రకారం భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడుతోడు రాగా దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆయన భార్య ఒక నాడు అడవిలో కనిపించకపోయేసరికి, తమ్ముడు లక్ష్మణుడి తో కలిసి వెతుకుతూ ఋష్యమూక పర్వతం వద్దకు వచ్చారు. సుగ్రీవుడు సీతను వెతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుడికి వానరరాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి, ఇచ్చిన మాట ప్రకారమే యుద్ధంలో వాలిని చంపి, సుగ్రీ వుడిని రాజును చేసాడు. వాలి ఎవరో, ఎట్టివాడో నీకూ తెలుసు. అలాంటివాడు ఒక్క రామబాణానికి చచ్చాడు. ఆ తర్వాత సీత ను వెతికేందుకు వేలాదివేల వానరులను అన్ని దిక్కులకూ పంపాడు సుగ్రీవుడు. ఆయన దగ్గర నాలాంటివాళ్లు అనేక మంది వున్నారు. నన్నొక్కడిని జయించడమే కష్టమైతే, వారం దరూ ఒక్కసారే వస్తే నువ్వేమి చేయగలవో ఆలోచించుకో. నేను వాయుపుత్రుడిని. హనుమంతుడు. సీతాదేవిని వెతు క్కుంటూ నూరామడల సముద్రాన్ని దాటి వచ్చాను. ఆమెను నీ ఇంట్లో చూసాను. నేను చెప్తున్నదంతా సత్యం”.
”ధర్మశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసావు. ప్రపం చం మెచ్చే రీతిలో తపస్సు చేసావు. ఇంత గొప్పవాడివి, పర స్త్రీలను బాధపెట్టడం ధర్మమా? రాక్షస వంశాన్ని నీ ఈ అధ ర్మ కార్యం కూకటివ్రేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? నీవంటి బుద్ధిమంతుడు, ఇలాంటి పనులు చేయవచ్చా? రామ చంద్రమూర్తి బాణాలకు, లక్ష్మణుడి బాణాలకు, నీవే కాదు దేవ దానవులందరు కలిసి ఎదిరించినా నిలువ లేరు. శ్రీరాముడికి కీడుచేసిన వారెవ్వరైనా, ముల్లోకాల్లో ప్రాణాలతో వుండడం సాధ్యమేమో నీవే ఆలోచించు. నిన్ను జయించి కారాగృహంలో బంధించిన కార్తవీర్యార్జునిడిని ఓడించి, ఇతర రాజులంద రినీ ఇరవై ఒక్కసార్లు చంపిన పరశురాముడిని అర ఘడియ లో బాణప్రయోగం లేకుండానే ఓడించాడాయన”.
”ధర్మమైనదీ, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు పనికొచ్చేదీ, సుఖలాభాలతో కూడినదైన సుగ్రీవుడి మాటలు విను. జానకీదేవిని రాముడికివ్వు. ఆమె ఎక్కడుందో చూశాం. వున్న స్థలం తెలిసిపోయింది. మిగిలిన కార్యం రామచంద్ర మూర్తే చేస్తాడు. రామచంద్రమూర్తి చూసిరమ్మన్నాడే కాని తీసుకుని రమ్మనలేదు కాబట్టి ఒక్కడినే వెళ్తున్నాను. సీతాదేవి ని చూసాను. ఆమె స్త్రీయే కదా అని నువ్వనుకుంటే పొరపాటు. నిన్ను చంపడానికి నీ మెడకు చుట్టుకున్న ఆడ త్రాచుపాము. దగ్గరకుపోతే చస్తావు. నిన్ను చంపటానికి ఆమే చాలు. నిన్ను చంపకుండా వదలదు కాబట్టి, ఆమెను నువ్వు వదులు”
”రావణా! ఎంతో కష్టపడి తపస్సు చేసావు. అది మర్చి పోయి, పాడు పనులెన్నో చేసావు. నీ తపస్సు వ్యర్ధమైపోతున్న దని మర్చావు. నీ తప:ఫలంతో దేవదానవులెవ్వరూ నిన్ను జయించకుండా వరం పొందావు. అవేవీ నిన్నిప్పుడు రక్షించ లేవు. ఎందుకో చెప్తా విను. నువ్వు దేవతలతో, దానవులతో, రాక్షసులతో, గంధర్వులతో, నాగులతో చావకుండా వరం పొందావు. సుగ్రీవుడు అమరుడు కాదు, అసురుడూ కాదు, గంధర్వుడు కూడా కాడు, దానవుడూ కానేకాదు, నీ వరాలు నిన్నెట్లా రక్షిస్తాయని అనుకుంటున్నావు? చీకటి, వెలుతురు ఒకేసారి రానట్లే, పాప- పుణ్యఫలాలు రెండూ ఒకేసారి అనుభ వించలేం. నువ్వు పుణ్యఫలం అనుభవిస్తున్నంత వరకూ, పాప ఫలం దరికిరాదు. ధర్మఫలం అధర్మఫలాన్ని చెరిపేస్తుంది. అధర్మఫలం ఇంకా నీకనుభవంలోకి రాలేదు. నీ తపస్సు నీకు దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, నువ్వుచేసిన పరస్త్రీ అపహరణనే పాపపు పనివల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరుగవు కాబట్టి, నీ చావింతవరకూ ఆగింది. ఇక నీ పూర్వ పుణ్యం పూర్వపాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాపకార్యాల నుండి నిన్ను రక్షించదు. నీవు ఎత్తుకొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరివారికి వారిని అప్పగిస్తే నీ దోషం పోతుంది. తప:ఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణి స్తుంది. నీ తప:ఫలం ఎంతవరకు అనుభవించాలో, అంతా అనుభవిస్తూ వచ్చావు. అది పూర్తయింది. ఇక నుండి నీవు చేసి న పాపఫలం నేటినుండే అనుభవిస్తావు. జనస్థానంలో వున్న నీ తమ్ములందరూ చావడంతో మొదలయింది నీ పాపఫలం అనుభవించే రోజు. తర్వాత నీ స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ నీకు అరిష్ట సూచనలే! ఇవన్నీ ఆలోచించి, నీకేది మంచిదని తోస్తే అదే చేయి. నీ అధర్మఫలాన్ని ఇప్పుడే, నిన్ననుభవించే టట్లు, నా మాటలను యదార్థం చేయగలను. నేనొక్కడినే లం కానగరాన్నంతా నాశనం చేయగలను. మీ శస్త్రాస్త్రాలు నన్నే మీ చేయలేవు. ఇంద్రజిత్తు దగ్గరున్న బ్రహ్మాస్త్రం పనికూడా అయిపోయింది. అది మళ్లి ఉపయోగపడదు.”
”జానకీదేవికి ద్రోహం చేసినవాడిని, తానే చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు శ్రీరాముడు. అందుకే నేనేమీ చేయలేకపోతు న్నా. నీ వశమందున్న జానకి ఉత్తమ స్త్రీ. ఆమె లంకంతా పాడు చేసేందుకు వచ్చిన కాళరాత్రి. ప్రళయకాలంలో కాళరాత్రి ఏవిధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నది. నువ్వు బ్రతకాలను కుంటే, లంకను కాపాడుకోవాలంటే, ఆమెను వదిలి పెట్టు.”
హనుమంతుడు మొదలు పెట్టినప్పుడు అనునయంగా చెప్పాడు. రావణుడి ముఖకవళికలను కనిపెట్టి, భయపడేలా చెప్పాడు. ”ఓ రాక్షసరాజా! నీమీద ప్రేమతో వరాలిచ్చిన స్వయంభు, బ్రహ్మదేవుడైనా, ముక్కంటి త్రిపురాంతకుడు అయిన రుద్రుడైనా, ఇంద్రుడు, మహంద్రుడైనా, ఈ ముగ్గు రూ కలిసొచ్చినా,రాముడి బారినుండి నిన్ను రక్షించలేరు. శరణాగతియే నీకు రక్షణ. ఆయన్నే శరణుకోరు”. ఇలా హనుమంతుడు చెప్పుకుంటూ పోతుంటే సహించలేకపోయాడు రావణాసురుడు. హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. విభీషణుడు రాజాజ్ఞ నీతికి విరోధమనీ, దోషమనీ చెబుతాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
- వనం జ్వాలా నరసింహారావు
8008137012