హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1కు దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఇక దృష్టిసారించింది. జులై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న టీఎస్పీఎస్సీ…పరీక్ష తేదీని మార్చాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ తేదీలను మార్చాలని అధికారులు యోచిస్తున్నారు. పరీక్ష తేదీలపై త్వరలోనే ఒక స్పష్టత ఇస్తామని పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్ష ముందస్తుగా ప్రకటించిన దాని ప్రకారం జూలై లేదా ఆగస్టులో నిర్వహించాలను కున్నారు.
అయితే దీన్ని సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించాలని కమిషన్ భావిస్తుంది. అలాగే మెయిన్స్ పరీక్ష తేదీని కూడా మార్పు చేసి కొత్త ఏడాది జనవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రూప్-1కు 3,80,202 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉండడం గమనార్హం. పురుష అభ్యర్థులు 2,28,951, మహిళా అభ్యర్థులు 1,51,192, ట్రాన్స్జెండర్ 59 మంది ఉన్నారు. విద్యార్హతల ప్రకారం చూసుకుంటే గ్రాడ్యుయేట్లు 2,53,490, పీజీ అభ్యర్థులు 1,22,826, ఇంటిగ్రేటెడ్(డిగ్రీ ప్లస్ పీజీ) చేసినవారు 1781, ఎంఫిల్ 424, పీహెచ్డీ చేసినవారు 1681 వారు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.