Friday, November 22, 2024

Festival of Flower – నేడు వెన్నెముద్ద‌ల బ‌త‌క‌మ్మ‌….

ఎనిమిదో రోజుకి చేరిన పూల పండుగ‌
గ్రామగ్రామాన మారుమోగుతున్న బతుక‌మ్మ పాట‌లు

హైద‌రాబాద్ – తెలంగాణలో పూల పండుగ ఎనిమిదవ రోజుకు చేరుకుంది. బతుకమ్మ పండుగను రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రతీరోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చుతూ ఆడిపాడుతారు మహిళలు. పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ప్రతీ చోట, ప్రతీ గ్రామంలో పూల పండుగను ఎంతో సంబురంగా జరుపుకుంటారు.

- Advertisement -

బతుకమ్మ …. బతుకమ్మ ఉయ్యాలో అంటూ వివిధ రకాల పాటలు పాడుతూ లయద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడి పాడుతుంటారు. ఈరోజు బతుకమ్మను వెన్నెముద్దల బతుకమ్మగా తెలంగాణ ఆడపడుచులు పిలుస్తారు. గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డి పూలతో బతుమ్మను పేరుస్తారు. వెన్నతో చేసిన పదార్థాలను నివేదిస్తారు కాబట్టి ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు.

ఈరోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు గౌరమ్మకు సమర్పిస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ తరువాత నుంచి ఒక్కో రోజు ఒక్కో వరుసను పెంచుకుంటూ బతుకమ్మను పేరుస్తారు. తెలంగాణ ఆడపడుచులు. ఈరోజు ఎనిమిది వరుసలతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు.

ఆపై ఇంటి ముందర వేసిన పెద్ద పెద్ద ముగ్గుల మధ్యలో బతుకమ్మను పెట్టి.. చుట్టుపక్కల ఆడవాళ్లతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు మహిళలు. బతుకమ్మ పాటలు పాడిన తర్వాత అంతా కలిసి చెరువులో కానీ, నదిలో కానీ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆపై ఇంటికి వచ్చాక చిన్నపిల్లలకు నువ్వులు, బెల్లం, వెన్నతో చేసిన పదార్థాలను పంచిపెడతారు. మహిళలు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంతటితో ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మను తయారు చేసేందుకు.. అందుకు కావాల్సిన పువ్వులను తెచ్చుకునేందుకు సిద్ధమవుతారు. ఎనిమిది రోజుల పూల పండుగ ఒక ఎత్తైతే చివరగా జరుపుకునే సద్దుల బతుకమ్మది మరో ఎత్తు. ఎంతో ఆడంబరంగా సద్దులబతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ మహిళలు. సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement