జంతు వైవిధ్యానికి నిలయం..
నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం
ఇక్కడే 270 చిరుతలు సంచరిస్తున్నట్టు ఆధారాలు
90 చీతాలు మన సంరక్షణ కేంద్రంలోనే ఉన్నాయి
దేశంలోని 55 పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇక్కడే అధికం
జీవ వైవిధ్యానికి పుట్టినిల్లులా నల్లమల అటవీ ప్రాంతం
స్మగ్లర బారిన పడకుండా పకడ్బందీ సంరక్షణా చర్యలు
ఈ మధ్య జరిపిన గణనలో కొత్త జంతువుల గుర్తింపు
కెమెరా ట్రాప్‌లలో లభించిన పలు ఆధారాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: క్రూర జంతువుల్లో పెద్దపులి తర్వాతి స్థానం చిరుత పులిదే. అటువంటి చిరుత పులులు అధికంగా ఉన్న ప్రాంతంగా నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం (ఎన్‌ఎస్‌టీఆర్) నిలిచింది. ఈ పరిధిలో మొత్తం 270 చిరుతలు ఉన్నాయని మరో 90 ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నాయని కేంద్ర గణాంకాలశాఖ ఎన్విస్టాట్స్-2024 ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలో ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇక్కడే పులులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సింహాలు, పెద్ద పులులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవనం సాగిస్తాయి. చిరుతలు అలా కాదు. అన్ని చోట్లా మనుగడ సాగించగలవు. ఈ కారణంగానే మైదాన ప్రాంతాల్లోనూ అవి సంచరిస్తుంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
అభయారణ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు..
జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు నల్లమల. పెద్ద పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎన్‌ఎస్‌టీఆర్ ఏర్పాటు చేసింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా అందులో 1,401 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల అభయారణ్యం ఉంది. ఇందులో ఎనభైకి పైగా పెద్ద పులులు ఉన్నాయి. వీటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. స్మగ్లర్ల బారినపడకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో వాటి దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల బారిన పడకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలు చిరుతపులుల సంఖ్య పెరిగేందుకూ దోహదం పడింది.
పులుల గణన ఇలా..
పెద్ద పులులు, చిరుతల గణనను పలు రకాలుగా చేపడతారు. వాటి పాద ముద్రలను సేకరించడం ఓ పద్ధతి. దీర్ఘచతురస్రంగా ఉంటే ఆడ, చతురస్రంగా ఉంటే మగ పులిగా గుర్తిస్తారు. పెద్ద పులి పాదం 14నుంచి 15 సెం.మీ.లు ఉంటే.. చిరుత పులి పాదం 7 నుంచి 8 సెం.మీ.గా ఉంటుంది. అవి సంచరించే ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి కూడా వాటిని గుర్తిస్తున్నారు. ఏ రెండు పులులకు ఒకేలా చారలు, మచ్చలు ఉండవని, వాటిని బట్టి కూడా సంఖ్యను లెక్కిస్తామని అధికారులు అంటున్నారు.
నల్లమలలో చర్యలు భేష్..
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు చిరుతలు ఎక్కువే ఉన్నాయని అంచనా వేశారు. అటవీ శాఖ ఆధ్వర్వంలో చేపట్టిన జంతు సంరక్షణ చర్యలే దీనికి ప్రధాన కారణం. వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్ పిట్స్ ఏర్పాటు చేయడం, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ట్యాంకర్ ద్వారా ఎప్పటికప్పుడు తాగునీటిని అందించడం వంటివి జంతువులు పెరుగడానికి ఎంతో దోహదపడ్డాయని చెప్పొచ్చు.
కొత్త జంతువుల గుర్తింపు
చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని నల్లమల అటవీ పరిధిలో పాలపేడ, ఎర్రపేడ, భూదేవిపెంట, చాకలిచెరువు, దయ్యాలగుట్ట, దాసర్లపల్లి, బచ్చాపురం, కాచరాజుపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 78 ట్రాప్ కెమెరాలు, 46 సాసర్స్ పిట్స్(నీటి తొట్టిలు) ఏర్పాటు చేశారు. 26వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో వివిధ రకాల మొక్కలు సైతం నాటారు. ఇక్కడికి అమ్రాబాద్ రిజర్వ్‌డ్ టైగర్ జోన్ దగ్గర ఉండడంతో ఆ ప్రాంతంలోని జంతువులు సైతం దాహార్తిని తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కెమెరా ట్రాప్‌లో కొత్త కొత్త జంతువులను గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇందులో జింకలు, మనుబోతులు, దుప్పులు, చిరుత, నెమలి, అడవి పందులు, అడవి కోళ్లు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, నక్కలతో పాటు మరికొన్ని రకాల జంతువులు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో నిరంతర గస్తీ ఉంటుంది, బీట్ ఆఫీసర్లు వాచ్ టవర్ ద్వారా ఇతరులు రాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు.