సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చిస్తున్నట్లు సమాచారం. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.
తనపై భూ కబ్జా నిందలు వేసి మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని, ఈ క్రమంలోనే ఆయన్ను కూడా కలిసినట్లు చెప్పారు. తనపై అధికార పార్టీ అభాండాలు వేసిన నాటి నుంచి ఈటలకు ప్రజల నుంచే కాక, విపక్షాల నుంచి కూడా మద్దతు పెరిగిపోయింది. ఇతర పార్టీ నేతలతో కూడా ఈటల వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల అనుసరిస్తున్న వ్యూహం ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.