న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాల మొత్తం బయటపెట్టాల్సిందేనని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ సంస్థ ఏ పార్టీకి ఎంతమేర నిధులు సమకూర్చిందో బహిర్గతం కావాల్సిందేనని అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని విమర్శించారు. ఎలక్ట్రోలర్ బాండ్లను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఈ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవాళ్లు, వాటిని సొమ్ము చేసుకున్న పార్టీల వివరాలను రూపొందించే టెక్నాలజీ స్టేట్ బ్యాంక్ దగ్గర లేదా అని ప్రశ్నించారు.
వివరాలను పొందుపరిచేందుకు తమ వద్ద సమయం లేదని సాకులు చెబుతూ దొంగలను కాపాడేందుకు ఎస్బీఐ ప్రయత్నిస్తోందని, అందుకే అసమగ్ర వివరాలు ఇచ్చిందని ఆరోపించారు. పార్టీలకు అందిన నిధుల విషయంలో పారదర్శకత ఉండాల్సిందేనని, దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు చేసే ప్రయత్నం సరికాదని అన్నారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ జరిపి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలున్నారని, ఇందుకు ప్రధాని, హోంమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. క్విడ్ ప్రో కో ద్వారా లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని అన్నారు.