Sunday, November 24, 2024

సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాన‌న్న క‌లెక్ట‌ర్

సిద్ధిపేటను అన్ని రంగాల్లో అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని కలెక్టర్ హన్మంతరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పూర్తి స్థాయి ఇన్ ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం హన్మంత్ రావు మాట్లాడుతూ…జిల్లాలను మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై త్వరగా సమీక్ష నిర్వహించి వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ, నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఆదేశానుసారం తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి స్టేటస్ తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్తామన్నారు. కలెక్టర్ గా నియామకమైన తర్వాత తొలిసారి ఐడీఓసీ కి వచ్చిన జిల్లా నూతన కలెక్టర్ ఎం హనుమంతరావుకు జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.
కలెక్టర్ ఆత్మీయ పలకరింపు ఆనందంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు సిద్దిపేట రెవెన్యూ డివిజన్ అధికారిగా కెరీర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు …ఇక్కడే ప్రత్యేక అధికారిగా, సంయుక్త కలెక్టర్ గా పని చేసారు. అనంతరం సంగారెడ్డి కలెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళారు. తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు నియామ‌క‌మ‌య్యారు. ఐడీఓసీ లోని తన ఛాంబర్ లో బుధవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు హనుమంతరావు ఐడీఓసీకి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కలెక్టర్ కు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అందరిని ఆప్యాయంగా పేరు పెట్టి జిల్లా కలెక్టర్ పలకరించారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసారు. ఇక్కడి నుంచి బదిలీ పై వెళ్లి చాలా కాలం అయినప్పటికీ తమను పేరు గుర్తుంచుకుని పలకరించడం పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, రెవెన్యూ డివిజన్ అధికారులు జయ చంద్రారెడ్డి, విజయేంద్ర రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఆర్డీఓ గోపాల్ రావు, జిల్లా సహకార అధికారి చంద్ర మోహన్ రెడ్డి, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement