Friday, January 10, 2025

TG | ఆదివాసీల‌పై వ‌రాల జ‌ల్లు…

  • అధికారికంగా కొమురం భీం జ‌యంతి, వ‌ర్ధంతి
  • ఆదివాసీల‌పై పెట్టిన ఉద్య‌మ కేసులు ఎత్తివేస్తాం…
  • ఆదివాసీ విద్యార్థుల‌కు వంద శాతం ఓవ‌ర్‌షిప్ స్కాల‌ర్‌షిప్‌లు
  • గోండీ భాష‌లో బోధ‌న‌పై స‌మ‌గ్ర నివేదిక‌కు ఆదేశం
  • సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు
  • ఆదివాసీ సంఘాలు, నాయ‌కుల‌తో స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఆదివాసీలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం జ‌యంతి.. వ‌ర్ధంతిని అధికారికంగా (స్టేట్ ఫంక్ష‌న్‌గా) నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి వెంట‌నే ఉత్త‌ర్వుల జారీ చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ఆదివాసీ సంఘాలు, నాయ‌కుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మయ్యారు. త‌మ ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, త‌మ‌పై న‌మోదైన‌, న‌మోదవుతున్న కేసులు, విద్యా, ఉద్యోగ‌, ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఆదివాసీ నాయ‌కులు ముఖ్య‌మంత్రికి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు.

ప్ర‌తి స‌మ‌స్య‌ను సావ‌ధానంగా విన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వారు లేవ‌నెత్తిన ప‌లు స‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం చూపారు. మ‌రికొన్నింటి ప‌రిష్కారానికి స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇది తొలి స‌మావేశం మాత్ర‌మేన‌ని, ప్ర‌తి నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి స‌మావేశ‌మ‌వుదామ‌ని ఆదివాసీ నాయ‌కులకు సీఎం తెలిపారు.

- Advertisement -

ఏడాదికి మూడు సార్లు జ‌రిగే స‌మావేశాల్లో గ‌త స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు, రాబోయే కాలంలో ప‌రిష్క‌రించుకోవాల్సిన అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని ఆదివాసీ నాయ‌కులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభ‌యమిచ్చారు. స‌మ‌స్య‌లను త‌న దృష్టికి తీసుకురావాల‌ని… ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆందోళ‌న‌ల‌కు దిగ‌వ‌ద్ద‌ని సీఎం సూచించారు.

ఆందోళ‌న‌ల‌ ఫ‌లితంగా యువ‌కుల‌పై కేసులు న‌మోద‌యితే భ‌విష్య‌త్‌లో అవి వారి ఉద్యోగ అవ‌కాశాల‌కు గండిపెడతాయ‌ని సీఎం తెలిపారు. ఆదివాసీల‌పై ఉద్య‌మాల స‌మ‌యంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామ‌ని.. ఈవిష‌యంలో అవ‌స‌ర‌మైతే శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌పెట్టి తీర్మానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

తాను పీసీసీ అధ్య‌క్షునిగా అయిన త‌ర్వాత తొలి స‌మావేశం ఇంద్ర‌వెల్లిలోనే పెట్టాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ నాయ‌కుల‌కు గుర్తు చేశారు. నాటి స‌మావేశంలో త‌న దృష్టికి వ‌చ్చిన ఇంద్ర‌వెల్లి అమ‌రుల స్మృతివ‌నం ఏర్పాటు, అమ‌రుల కుటుంబాల‌కు ఇళ్ల మంజూరు వంటి వాటిని అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పూర్తి చేశామ‌ని సీఎం తెలిపారు.

రాజ‌కీయాలప‌రంగా ఆదివాసీల‌కు అన్యాయం చోటుచేసుకుండా చూస్తున్నామ‌ని, సీత‌క్క‌ను ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌ఛార్జిగా మంత్రిగా పెట్టామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

ఆదివాసీ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక స్ట‌డీ స‌ర్కిల్‌…

ఆదివాసీ విద్యార్థుల విద్యా, ఉద్యోగ‌, ఆర్థికాభివృద్ధికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ఆదివాసీ విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా స్ట‌డీ స‌ర్కిల్ ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

స్ట‌డీ స‌ర్కిల్‌కు అవ‌స‌ర‌మైన భ‌వన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థులంద‌రికీ ఓవ‌ర్‌షిప్ స్కాల‌ర్‌షిప్‌లు మంజూరు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ ద‌ర‌ఖాస్తుల వివ‌రాల‌ను వెంట‌నే మంత్రి సీత‌క్క‌కు అంద‌జేయాల‌ని సీఎం ఆదివాసీ నాయ‌కుల‌కు సూచించారు.

విద్యార్థుల‌కు గోండీ భాష‌లో ప్రాథ‌మిక విద్య‌ను బోధించ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉట్నూరు, భ‌ద్రాచ‌లంలోని ట్రైబ‌ల్‌ బీఈడీ క‌ళాశాల‌ల్లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ఆదివాసీ విద్యార్థుల‌కు స్కిల్ యూనివ‌ర్సిటీలో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తామ‌ని, వారికి వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని సీఎం తెలిపారు. ఏజెన్సీలోని ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చుతున్నామ‌ని, వాటిలో ఆదివాసీ విద్యార్థులు చేరేలా ఆదివాసీ పెద్ద‌లు, విద్యావంతులు ప్రోత్స‌హించాల‌ని సీఎం సూచించారు.

ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడ‌తాం….

ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్ల‌తో సంబంధం లేకుండా ఆదివాసుల‌కు సీఎం కోటా కింద ప్ర‌త్యేకంగా ఇళ్లు మంజూరు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఈ ఇళ్లు ఇచ్చేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

నాన్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల‌కు ఇళ్లు కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. ఆదివాసీ రైతుల‌కు ఉచితంగా సోలార్ మోటార్లు (వంద శాతం రాయితీ) అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఇందిర జ‌ల‌ప్ర‌భ కింద ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు.

ఉచితంగా సోలార్ పంపుసెట్ల‌తో పాటు ఇళ్ల‌కు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని సీఎం చెప్పారు. ఆదివాసీ గూడేల్లో తాగు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని… ఇందుకోసం ఐటీడీఏల ప‌రిధిలో వెంట‌నే స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

కేస్లాపూర్ జాత‌ర‌కు నిధులు

కేస్లాపూర్ జాత‌ర‌కు నిధులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఆదివాసీల‌కు ఎంతో కీల‌క‌మైన రాయి సెంట‌ర్ల‌కు భ‌వ‌నాల నిర్మాణం చేప‌డతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాయి సెంట‌ర్ల నిర్మాణం, అందుకు అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాలు, ఎన్ని భ‌వ‌నాలు అవ‌స‌రమ‌నే దానిపై అధ్యయనం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

ఆయా భ‌వ‌నాలు ఎలా ఉండాల‌నే దానిపై పంచాయ‌తీరాజ్ శాఖ నుంచి న‌మూనాలు త‌యారు చేయించాల‌ని మంత్రి సీత‌క్క‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. స‌మావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు, ప్రొఫెస‌ర్ గుమ్మ‌డి అనురాధ‌, ఆదివాసీ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement