ఇక నుంచి దంపతులు ముగ్గురు పిల్లలు కనడానికి చైనా అనుమతించింది. సోమవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనాభా నియంత్రణ విషయంలో చైనా ప్రభుత్వం దశాబ్ధాల తరబడి అమలు చేసిన పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. చైనాలో దంపతులు పాపైనా.. బాబైనా ఒకరితోనే సరిపెట్టుకోవాలన్న కఠిన నిబంధనను దశాబ్దాలుగా అమలు చేసిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ నిబంధన అమలు చేయడంతో జననాలు-మరణాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. దేశంలో యువత సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ.. వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో జరిగిన నష్టం పూడ్చుకోవడంపై ఆలస్యంగా నైనా కన్ను తెరచిన చైనా ఒకరినే కనాలనే చట్టంలో సవరణలు చేసింది. 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది.
2016లో కొత్త సవరణల మేరకు దంపతులు ఇద్దరు పిల్లలు ఉండేందుకు అనుమతించారు. అయినా దేశంలో జననాల రేటు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. గత ఏడాది కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత ఈ సంవత్సరంలోనూ జననాల రేటు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. దీంతో తాజాగా ముగ్గురు పిల్లలను కనొచ్చన్న నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ద కాలంలో చైనా జనాభా కేవలం 7.2 కోట్లు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం చైనా 141 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో కొనసాగుతోంది.