- ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్.
- కొలువుతీరిన చాగంటి, గరికపాటి, సామవేదం, పురాణపండ గ్రంథాలు
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ఒక మహోజ్వల ఘట్టానికి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మరోసారి వేదికవుతోంది. లక్షల మంది విద్యార్థులు, రసజ్ఞులు, పాఠకులు, కవులు, రచయితలు, పరిశోధకులు, కళాకారులు, మేధోసమాజానికి ప్రయోజనాన్ని చేకూర్చే అద్భుత గ్రంథాలన్నీ వివిధ భాషల్లో ఒక మహా ప్రపంచంగా పుస్తక ప్రదర్శన(బుక్ ఫెయిర్) బహుముఖాలుగా అవతరించబోతోంది.
ప్రముఖ కవి యాకూబ్ ఈ సంవత్సరం ఈ బ్రహ్మాండమైన పుస్తక మహోత్సవ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించనున్నారు. సాహిత్య సాంస్కృతిక పరిశోధనల సంపదల్ని వందలాది అలమారాల్లో పెట్టి, మనసుల్ని పుస్తకాల మధ్య మమేకం చేసి మన ముందు ప్రదర్శించి అమ్మబోతున్నారు.
ఎంత కవిత్వ సాహిత్య జీవనసాఫల్య గ్రంథాలున్నా తెలుగులో గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గ్రంథాల అమ్మకానిదే పైచేయి అంటున్నారు పుస్తక విక్రేతలు.
ఉత్తమ సాహిత్యాభిరుచి ఉన్నవారికోసం పాలగుమ్మి పద్మరాజు, నండూరి సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, కరుణశ్రీ, చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కారా మాష్టారు, రావిశాస్త్రి, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, చిలకమర్తి, పిలకా గణపతిశాస్త్రి, కొత్తపల్లి వీరభద్రరావు, కేతు విశ్వనాధరెడ్డి, కాళోజీ నారాయణరావు, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు(చాసో), ఉషశ్రీ, కే.రామచంద్రమూర్తి, కే.శ్రీనివాస్, గురజాడ అప్పారావు, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, ఆచార్య తిరుమల రామచంద్ర, దాశరథి రంగాచార్య, నండూరి రామ్మోహనరావు, సీ.నారాయణరెడ్డి, నగ్నముని, శివారెడ్డి, వేటూరి సుందరామ్మూర్తి, అనుమాండ్ల భూమయ్య, కొలకలూరి ఇనాక్, బేతవోలు రామబ్రహ్మం, యాకూబ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, రామ్‌గోపాల్ వర్మ, ఆవంత్స సోమసుందర్, వాడ్రేవు చినవీరభద్రుడు, మహామ్మద్ ఖదీర్‌బాబు, సతీష్‌చంద్ర, తనికెళ్ళ భరణి, కుప్పిలి పద్మ, జయధీర్ తిరుమలరావు, శిఖామణి, అఫ్సర్, అద్దేపల్లి రామ్మోహన్రావు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, పురాణపండ శ్రీనివాస్.. ఇలా ఎందరో విఖ్యాత రచయితలు, కవులు, విమర్శకులు, పరిశోధకుల గ్రంథ పరిమళాలు ఇప్పటికే ఎన్టీఆర్ స్టేడియమంతా వ్యాపించాయని సాహితీవేత్తలు సంతోషం వెలిబుచ్చుతున్నారు.
ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చేవారికి ఎన్నో జ్ఞాపకాలతో అల్లుకుపోయే అపురూప ఘటనలుంటాయని, ఇందులో భాగంగానే సాహిత్య సాంస్కృతిక అంశాలతో సభలు, సమావేశాలు, పోటీలు జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
సామాజిక సాంస్కృతికాంశాల ప్రాతిపదికగా నూతనోత్తేజంతో ఈ సంవత్సరం ఈ చక్కని పుస్తక ప్రదర్శన గురువారం నుంచి పదిరోజుల పాటు అలరించబోతోంది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంరంభాన్ని ప్రారంభించబోతున్నారని, ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారని బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది.