కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని వినోద్ తరపు లాయర్ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందిన 24 గంటల్లో కాంగ్రెస్ నేతలు తన క్లయింట్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, విపక్షాల మధ్య హై డ్రామా చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ ఆరోపించింది. బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు వినోద్ తావ్డే, ఇతర బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ.. వినోద్ తావ్డే కాంగ్రెస్ అగ్రనేతలకు పరువు నష్టం నోటీసులు ఇచ్చారు.