- వైద్య సేవలు అందించకుండా రోగిని పట్టించుకోని వైనం..
- ప్రైవేట్ ఆస్పత్రికి సిటీ స్కానింగ్ కోసం టెస్టులు..
- చంటి పిల్లలతో గేటు బయట బిక్కుబిక్కుమంటూ రోగి అవస్థలు..
- భుజంపై రోగిని తీసుకువచ్చి ఆస్పత్రి ఎదుట ఆందోళన
- సర్కారు దవాఖాన తీరు మారేది ఎప్పుడు
నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 11 (ఆంధ్రప్రభ ) : రోగం వస్తే సర్కారు దవాఖానకు వచ్చేందుకు వామ్మో సర్కారు దవాఖానా అనేలా జిల్లా ప్రజలు భయపడుతున్నారు. అనారోగ్యానికి గురై వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వస్తే రోగి పట్ల సర్కారు దవాఖాన వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రాణంమీదికొచ్చినా పట్టించుకోకపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నవీపేట మండలం దండిగుట్ట గ్రామానికి చెందిన మహిళ లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. పిట్స్ వస్తుంటే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి శుక్రవారం మధ్యాహ్నం చికిత్స కోసం వచ్చింది. రైతులు ఆమెను పరీక్షించి వెంటనే సిటీ స్కానింగ్ చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ విభాగానికి వెళ్లారు. రోగికి పదే పదే ఫిట్స్ వచ్చి పరిస్థితి విషమించినా.. సుమారు రెండు గంటల పాటు వేచి ఉన్న సిటీ స్కానింగ్ విభాగం పట్టించుకోకపోవడం దారుణం. దీంతో రోగిని వైద్యుల వద్దకు తీసుకువచ్చి స్కానింగ్ చేయడం లేదని, మా పరిస్థితి ఏమిటి అని వైద్యులతో మొర పెట్టుకున్నారు. వెంటనే వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ చేసుకొని రావాలని రోగి బంధువులకు సూచించారు.
అంతేకాకుండా రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో బయటకు తీసుకెళ్లాలని సర్కారు దవాఖాన సిబ్బంది తెలిపారు. డబ్బులు పెట్టె స్థోమత లేని, తోచని స్థితిలో కొన్ని గంటలపాటు ఆసుపత్రిలో రోగి బంధువులు వేచిఉన్నారు. దవాఖాన సిబ్బంది రోగిని ఇక్కడి నుంచి తీసు కువెళ్లాలంటూ దబాయించడంతో ఏమి చేయాలో తోచక రోగి బంధువులు రోగిని బయటకు తీసుకెళ్లారు.
చంటి పిల్లలతో గేటు బయట బిక్కు బిక్కుమంటూ రోగి అవస్థలు…
ఇద్దరు చంటి పిల్లలతో గేటు బయట సుమారు నాలుగు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ రోగి అవస్థలు అంతా ఇంతా కావు. చలికి గజగజ వణుకుతూ దోమల్లో అక్కడే పడిఉన్నారు. ఆ సమయంలో కూడా రోగికి ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. రాత్రి 11 గంటల తర్వాత ఊరు నుంచి వచ్చిన రోగి బంధువులు రోగిని భుజం పై వేసుకొని వైద్యం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రోగి ధర్నా చేపట్టడంతో స్పందించిన వైద్య సిబ్బంది వెంటనే రోగిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు.
సిటీ స్కాన్ పనిచేయడం లేదంటూ ప్రైవేట్ ఆసుపత్రికి టెస్టులు రాయడం ఏమిటి…
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు వైద్యం అందజేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేపట్టింది. కానీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ పనిచేయడం లేదంటూ సాకులు చెప్పడం ఏమిటి.. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి సిటీ స్కానింగ్ టెస్టులు రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ప్రవేట్ ఆసుపత్రులతో జిల్లా సర్కారు దవాఖాన కుమ్మక్కైనట్టు ఆరోపణలున్నాయి.
వైద్యశాఖ మంత్రి సందర్శించినా తీరుమారని సర్కారు దవాఖాన…
ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సందర్శించారు. సౌకర్యాలపై రోగులకు వైద్యులు అందజేస్తున్న సేవలపై మండిపడ్డారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తగా పనిచేయాలని మంత్రి హెచ్చరించినా జిల్లా సర్కారు దవాఖాన తీరు మారలేదు. అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతుందని నమ్మకం ప్రజల్లో లేదు. ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి ప్రభుత్వాసుపత్రిపై దృష్టి సారించి రోగులకు సకాలంలో వైద్యం అందజేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆంధ్రప్రభ న్యూస్ లైన్ సంప్రదించగా స్పందించలేదు.. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.