హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసిందని హరీష్ అన్నారు. తొలి ఏడాదిలోనే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇదే కొనసాగితే ఐదేండ్లలో అప్పుల్లో మమ్మల్ని మించిపోతారని విమర్శించారు. భూములను కుదువ పెట్టి అప్పులు చేయాలని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా లేదా అని ప్రశ్నించారు. రూ.75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములను అమ్మేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
అసెంబ్లీలో అర్థిక కార్యక్రమాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, భట్టి తాము అప్పు చేశామని పదే పదే అంటున్నారని, తమ అప్పు కేవలం రూ.4.14 లక్షల కోట్లేనని ఈ సందర్భంగా అన్నారు. కరోనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నామని, రూ.39 వేల కోట్లు కరోనా సమయంలో అప్పు తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల, కేంద్ర వైఖరి వలన ఆదాయం తగ్గిందని, అందుకోసం కొంత అప్పు చేయాల్సి వచ్చిందని అన్నారు. అదే విధంగా గత ప్రభుత్వం తమకు రూ.70 వేల కోట్ల అప్పు ఇచ్చిందని, అది తమ ఖాతాలో ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ తీసేస్తే తాము చేసిన అప్పు కేవలం రూ.4.14 లక్షల కోట్లేనని తెలిపారు.
తాము దిగిపోయే నాటికి రాష్ట్ర ఆదాయం రూ.1.53 లక్షల కోట్లు ఉందని హరీష్ రావు అన్నారు. రెవెన్యూ రాబడి, వ్యయం పరంగా చూస్తే తాము కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.2.96 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కు అప్పగించామని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఐదేళ్లలోనే 7 లక్షల కోట్లు మించి పోతుందని ఎద్దేవా చేశారు. అప్పులపై తాను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
అబద్దాలు చెప్పడంలో హరీశ్ రావు తర్వాతే ఏవరైనా ..
అబద్ధాలు చెప్పడం హరీష్ రావు తర్వాతే ఎవరైనా అంటూ భట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కట్టిన అప్పే రూ.1 లక్షా 18 వేల కోట్లు అయితే మళ్లీ లక్ష కోట్ల అప్పు చేశామనటం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా అడ్డగోలుగా ఖర్చు చేయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఎప్పుడైనా లక్ష18 వేల కోట్ల అప్పు కట్టారా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు అప్పు తెచచుకోవడం.. దోచుకోవడం.. తినడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్ర అప్పు 6 వేల కోట్లే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.