Monday, December 23, 2024

AP – పోలవరం ప్రధాన డ్యాం అంచనా పెంపు

అమ‌రాతి – పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం అంచనాలను రూ.11,214.78 కోట్లకు సవరించారు. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన డ్యాంలో పరిశోధన, సర్వే, ప్రిపరేషన్‌ పనులు, డిజైన్లు, డ్రాయింగుల రూపకల్పన, ప్రధాన డ్యాం మొదటి రెండు భాగాల్లో రాతి, మట్టికట్ట నిర్మాణం, మూడో భాగంలో కాంక్రీటు డ్యాం నిర్మాణం, కాఫర్‌ డ్యాంల నిర్మాణం, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, స్పిల్‌ వే నిర్మాణం తదితరాలన్నీ ఇందులోకి వస్తాయి. విద్యుత్‌కేంద్రం నిర్మాణం కోసం చేపట్టిన పునాది పనులూ ఈ అంచనాల్లో కలుస్తాయి. ప్రధాన డ్యాంలో వరదల వల్ల కోత పడ్డ ప్రాంతంలో ఇసుకతో నింపి సాంద్రత పెంచి ఆ ఇసుక గట్టిదనాన్ని పెంచేలా పనులు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. నది రెండువైపులా గట్ల రక్షణ పనులు ఇందులోకి వస్తాయి.

అప్పట్లో రూ.4,717 కోట్లు

పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం అంచనాలు 2013-14లో రూ.4,717 కోట్లుగా లెక్క కట్టి పాలనామోదం ఇచ్చారు. అప్పట్లో టెండర్లు పిలిచి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు 14.055% తక్కువకు పనులు అప్పగించారు. ఆ టెండర్‌ డిస్కౌంట్‌ మినహాయించి రూ.4,054 కోట్లుగా లెక్కించారు. తర్వాత భూసేకరణ ఆలస్యం కావడంతో గుత్తేదారు పనులు చేపట్టడం ఆలస్యమైంది. ఈ క్రమంలో 2015 అక్టోబరు 10 నాటికి పనుల అంచనా విలువను పెంచారు. ట్రాన్స్‌ట్రాయ్‌ టెండర్‌ డిస్కౌంట్‌ను కూడా మినహాయించి అప్పటికి పని విలువను రూ.5,535.14 కోట్లకు చేర్చారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక అప్పటికి మిగిలి ఉన్న పనిని మేఘా సంస్థకు అప్పజెప్పింది. రూ.1,548.12 కోట్లకు పూర్తిచేసేలా ఆ పనులు అప్పగించింది. 2021లో ప్రధాన డ్యాం పనుల అంచనాలను రూ.7,192 కోట్లకు పెంచింది. 2023లో రూ.2,022 కోట్ల అదనపు పనులకు జలవనరుల శాఖ పాలనామోదం ఇచ్చింది. గడిచిన ఐదేళ్లలో పనులు పూర్తి చేయకపోవడం, కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం, భారీ వరదకు ప్రధాన డ్యాం ప్రాంతం కోసుకుపోవడం, కాఫర్‌ డ్యాంల లీకేజీ సరిదిద్దడం వంటి పనుల వల్ల ప్రస్తుతం మళ్లీ అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement