విశాఖపట్టణం,ఆంధ్ర ప్రభ బ్యూరో నవంబర్ 24 ః ఈ నెల 29వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ నిర్వహణ, ప్రజల సీటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖపట్టణం ఎంపీ ఎం. శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వీఐపీల రాక, ప్రధాన మంత్రికి స్వాగతం ఏర్పాట్లు, రోడ్ షో, ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర కనీస వసతుల కల్పన తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు సలహాలు, సూచనలు అందజేశారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై ముందుగా జిల్లా కలెక్టర్ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారని, వారు ఉండేందుకు బస ఏర్పాట్లను వెల్లడించారు. గవర్నర్ నోవొటెల్, ముఖ్యమంత్రి పోర్టు గెస్ట్ హౌస్ లో ఉండేందుకు ప్రాథమికంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 29వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం లేదా వాయు మార్గం ద్వారా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని వివరించారు.
వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చినట్లయితే టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు ప్రధాని రోడ్ షో ఉండొచ్చని పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ప్రాథమికంగా జిల్లా యంత్రాంగం నుంచి చర్యలు చేపడతున్నట్లు ప్రజా ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
*ప్రధాని పర్యటన షెడ్యూల్,
ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం విశాఖపట్టణం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ, రోడ్ షో పర్యటన సందర్బంగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం 3.40 గంటలకు వాయు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్ వినాయక్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్రధాన వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు. ఈ క్రమంలో టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ నిర్దేశించి కార్యక్రమంలో 4.45 నుంచి 5.00 గంటల వరకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో కలిసి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగాల అనంతరం 5.25 నుంచి 5.43 గంటలకు ప్రధాన మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తదుపరి 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుపయనమవుతారు.
ఈ సమీక్ష లో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి. శ్రీలేఖ, సంగీత్ మాధుర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.