ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం
ఏపీలో వరదలు.. నష్టం అపారం
అంచనాలపై కేంద్ర బృందం పర్యటన
విపత్తు నిర్వహణ సంస్థ ఆపీసులో అధికారులతో భేటీ
బుడమేరు పొంగిన విధానంపై వివరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇవ్వాళ, రేపు ముంపు ప్రాంతాల్లో పరిశీలించనున్న కేంద్ర బృందం
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ : ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటిస్తోంది. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వరద నష్టం తీవ్రతను వివరించారు.
బుడమేరు పొంగిన విధానంపై వివరణ..
బుడమేరుకు వరద ఏ విధంగా వచ్చింది. నగరాన్ని ఏ విధంగా ముంచెత్తిందనే అంశాన్ని కేంద్ర బృందానికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. వరద ఉద్ధృతి కృష్ణా నది వరద వల్ల నీట మునిగిన పంటల వివరాలను అందించారు. ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణా నదికి వరద వచ్చిందని తెలిపారు. పది రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని తెలిపారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోడియా తెలిపారు. గోదావరి, వంశాధార, నాగావాళి నదుల వరద ఉద్ధృతి గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్రబృందానికి వివరించారు.
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర ప్రతినిధులు పర్యటించనున్నారు. ఒక బృందం కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో మరో బృందం పర్యటించనుంది. యనమలకుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమ్‌ను పరిశీలించనున్నారు. పెద్దపులిపాకలో దెబ్బతిన్న ఇళ్లు, ఉద్యానవన పంటలను పరిశీలించనున్నారు. చోడవరంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయనున్నారు. నందివాడ మండలంలో నీటిలో మునిగి ఉన్న ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం వేమూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పంట నష్టంపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌ను తిలకించనుంది. పెసర్లంకలోని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడనున్నారు.