గన్నవరం ప్రభ న్యూస్ : ఇసుక దందాలో సీఎం జగన్ రోజుకు రూ.3కోట్లు చొప్పున అక్రమంగా సంపాదిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, సిమెంట్, ఐరన్ ఛార్జీలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యమాల వాడ బెజవాడ ప్రజల ఆగ్రహంలో జగన్ కొట్టుకుపోతారన్నారు. యువగళం చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.
యువగళానికి వచ్చిన స్పందన చూసి జగన్కు భయం పట్టుకుందన్నారు. పవిత్రమైన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. మామిడి, పత్తి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం. పెడన చేనేత కార్మికులని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తాం. మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తాం. కృష్ణాడెల్టా చివరి ఆయకట్టు వరకు రైతాంగానికి సాగునీరు అందిస్తాం.
విజయవాడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పార్టీ కోసం కష్టపడిన వారిని గుండెల్లో పెట్టుకుంటా. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లా లో ఉన్నా విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తాం. చట్టాలు అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్ర 191వ రోజుకు చేరడంతో గన్నవరం సభకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, మారిన సమీకరణాలతో బలనిరూపణకు గన్నవరం సభ వేదికగా మారింది. మరో వైపు యార్లగడ్డ వెంకట్రావ్ రాక టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. మాజీ మంత్రులు దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీని అపవిత్రం చేసిన ఎమ్మెల్యేలు కృష్ణాజిల్లా వారై ఉండడం బాధాకరం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా ఉన్నతమైన, నిస్వార్ధమైన నాయకులకు పెట్టింది పేరు అని వెల్లడించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కీర్తించారు. కానీ నేడు కొంతమంది అరాచక శక్తుల వల్ల కృష్ణాజిల్లా ప్రతిష్ఠ మసకబారిందని మండలి బుద్ధప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అసెంబ్లీని అపవిత్రం చేసిన ఎమ్మెల్యేలు కృష్ణాజిల్లాకు చెందిన వారై ఉండడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిస్వార్ధ నాయకుడు గన్నవరం నుంచి అసెంబ్లీకి వెళ్లారని, అలాంటి గన్నవరం నియోజకవర్గంలో నేడు ఉన్న ఎమ్మెల్యే జిల్లా పరువు తీస్తున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుండి ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను అని మండలి పిలుపునిచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తును బాగుచేయగలిగే వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని ఆయన ఉద్ఘాటించారు. రైతుల భవిష్యత్తును ముందే ఊహించి పట్టిసీమను తెచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సక్రమమైన నాయకుడు రావాలి. జగన్ వంటి వక్రబుద్ధి కలిగిన నాయకులు రాకూడదని స్పష్టం చేశారు.
కొడాలి నాని పెళ్లికి నందమూరి హరికృష్ణ ఎందుకు రాలేదు? : యార్లగడ్డ వెంకట్రావు
ఇటీవల టీడీపీలో చేరిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై ధ్వజమెత్తారు. కొడాలి నాని వల్లే గతంలో నందమూరి హరికృష్ణ గుడివాడలో ఓడిపోయారని వెల్లడించారు. కొడాలి నాని పెళ్లికి హరికృష్ణ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొడాలి నాని హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు వాడుకుంటాడని విమర్శించారు.
కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు తెలుగు భాషకే అవమానం అని యార్లగడ్డ మండిపడ్డారు. పార్టీ కోరుకుంటే గుడివాడ వెళ్లి కొడాలి నానిపై పోటీ చేసేందుకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. గన్నవరం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ప్రాంతం అని, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిందని యార్లగడ్డ వివరించారు. గతంలో కొనకళ్ల నారాయణ ఎంపీగా గెలిచేందుకు ప్రధాన కారణం గన్నవరం నియోజకవర్గమేనని అన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ బాలశౌరికి గన్నవరంలో 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మంచి పోలీసు అధికారులు ఉండి ఉంటే తానే గెలిచేవాడ్నని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నించైనా పోటీ చేస్తానని, గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేస్తానని ధీమా వ్యక్తం చేశారు.