Wednesday, September 18, 2024

Andhra Pradesh – ఒకే చ‌ట్టం ప‌రిధిలోకి విశ్వ విద్యాల‌యాలు

యూనివ‌ర్సిటీలన్నింటికీ ఒకే చట్టం
ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు
ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 వ‌ర్సిటీలు
వీట‌న్నింటికీ వేర్వేరు చట్టాలు అమ‌లు
ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ
ఉన్నత విద్యామండలికి బాధ్య‌త‌ల అప్ప‌గింత
బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను తీసుకొచ్చే ప్లాన్‌
పారిశ్రామికవేత్తలకూ సభ్యత్వం
చాన్స్‌ల‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ ఉండేలా మార్పులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌: విద్యావ్య‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు ఏపీలోని కూట‌మి స‌ర్కారు చ‌ర్య‌లు చేప‌డుతోంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యావ్యవస్థలో తీసుకుచ్చిన‌ మార్పులను ప్ర‌క్షాళ‌న చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీనికోసం ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 యూనివ‌ర్సిటీలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణచేసే బాధ్యతను ఉన్నత విద్యామండలికి ప్ర‌భుత్వం అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. కొత్త చట్టాన్ని డిసెంబరులోపు రూపొందించాలని విద్యామండలికి సీఎం నుంచి ఆదేశాలు అందాయి.

- Advertisement -

పారిశ్రామిక వేత్త‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేలా..

యూనివర్సిటీల పాలకమండళ్ల స్థానంలో బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ స్థానంలో కొత్తగా బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తలను సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. అదే విధంగా ఆర్‌జీయూకేటీ కులపతిగా గవర్నర్‌కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది. ఇక.. ట్రిపుల్ ఐటీల కోసం రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని యూనివర్సిటీలకు గవర్నర్‌ కులపతి కాగా దీనికి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది.

వైసీపీ హ‌యాంలో చ‌ట్ట స‌వ‌ర‌ణ‌.. చాన్స్‌ల‌ర్‌గా సీఎం

వైసీపీ హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా ముఖ్య‌మంత్రి ఉండేలా మార్చేశారు. ఈ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం లభించినప్పటికీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్‌ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement