మన అమ్మలనందరినీ కన్న అమ్మ దుర్గమ్మ. ”దయాంబురాశివి గదమ్మ” అంటూ ప్రార్థిస్తుంది సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి ఐన రుక్మిణీదేవి. ”హరిన్ పతిజేయుమ మ్మ!” అని ఆమె సత్యార్థ సంధాయిని సామాన్య భక్తుల కోర్కెలే కాదు. దేవీ ఉపాస కుల ఆధ్యాత్మిక సిద్ధిననుగ్రహించే తల్లి! జగన్మంగళయైన ఆ తల్లిని దీప దుర్గాదేవిగా దర్శించి, సాక్షాత్తు పరమేశ్వరుడే ”దుర్గా కవచము”ను ఉపదేశించినాడని ప్రతీతి. ఇది ”భైరవ తం త్రం”లో చెప్పబడి ఉంది. శివుడు, భైరవుని కోరిక మేరకు దీనిని ప్రవచించినాడు. ఇది అత్యం త నిగూఢమైన విషయములతో శోభిల్లుతున్నది. స్వామివారు ఇలా అంటున్నారు.
శ్లో|| రహస్య శృణు వక్షామి భైరవ! ప్రాణవల్లభే
శ్రీ జగన్మంగళం నామ కవచం మంత్ర విగ్రహమ్
దీనికి జగన్మంగళా కవచమ్ అని పేరు. ‘కవచం’ అంటే రక్షణ. రఘూత్తముడైన శ్రీరామ చంద్ర ప్రభువు రాక్షస సంహారము కొరకు దీనిని మననము చేసినాడు. కుబేరుడు, శచీపతి ఐన ఇంద్రుడు, ఈ కవచము మహిమతోనే త్రైలోక్య విజయమును పొందినారు. క్లుప్తంగా కవచ సారాంశం ఇది. ”కాళికాదేవి నా శిరస్సును, నేత్రములను ఖడ్గధారిణియైన అంబ, ఘ్రాణ యుగ్మమును, రసన (నాలుక)ను, స్వాహా స్వరూపిణియైన జనని, మహావిద్యయైన గౌరి, నా వదన సకలమును రక్షించుగాక!” నా హృదయమును చాముండ, భుజములను అష్టాక్షరి, నాభిని షడాక్షరి, దశాక్షరి నాగుహ్యజఘనములను రక్షించుగాక! కపాలినియైన కాళీమాత నాకు సక ల విద్యలను, కళలను ప్రసాదించుగాక!
”శ్రీ జగన్మంగళం నామ మహావిద్యౌఘ విగ్రహమ్
త్రైలోక్యాకర్షణం బ్రహ్మన్ కవచం మన్ముఖోదితమ్”
”ఓ భైరవా! నా నోటి నుండి వచ్చిన ఈ కవచము మహావిద్యలన్నింటికి మూలభూత ము. దీనిని పఠించిన వారికి సర్వవిధముల రక్షణ లభించును.”
బ్రహ్మాండ పురాణములో చెప్పబడిన, భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు వచించిన ‘నృసింహ కవచము’ కూడ అత్యంత ప్రభావవంతమైనది. మన శరీరము వివిధ నాడీ సంకలనము. అమ్మవారి వివిధ నామములను, షడాక్షరి, అష్టాక్షరి, దశాక్షరిగా మననము చేయడం వలన మన బాహ్యశరీరము స్వస్థమై, ఆ ముష్మిక మార్గమునకు దారి వెతుకుతుంది.
ఇక అష్టోత్తరశత (108) దీపలక్ష్ముల స్తోత్రమున్నది. ”ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమ:” అన్నది మంత్రము. దీనిలో ఆమెను విద్య, ధనము, ధ్యానం, విజయము, శౌర్యము, ధైర్యము, శాంతి, అన్నము, కీర్తి, సంతానము, రూపము, భోగము, మతి, పుష్టి, తుష్టి, కాం తి, మేధ, లాభం, దయ, భక్తి ఇట్లు ఎన్నో విషయముల కొరకు అమ్మవారిని ప్రార్థించడం ఉం టుంది. చివరగా- ”మహావక్తి స్వరూపస్త్యాం మహామహిమ శాలినీ
మహామహిమ సంపన్నే, మహా దేవీనమోస్తుతే” అని ముగుస్తుంది.
ఇక మార్కండేయ కృతమైన అర్గళాస్తోత్రం ఉంది. అది కూడ అమ్మవారిని సకల శుభ ములకు ప్రార్థించేది. దానిలో మార్కండేయుడు తల్లిని భద్రకాళిగా, కపాలినిగా, మహిషా సురమర్దినిగా, చండికగా, చతుర్భుజిగా, పరమేశ్వరిగా, సంసార తారిణిగా, దత్తానందగా స్తుతించినాడు. ఆమెను శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థించినట్లుగా ఉంది.
”జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గాక్షమా శివాధాత్రీ స్వాహాస్వధా నమోస్తుతే!” అని ప్రార్థించాడు మార్కండేయుడు.
బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మంగారి విరచితమైన ‘శ్రీలలితా మంగళ హారతి’ పాట, అందరూ పాడుకోడానికి వీలుగా, సులభమైన భాషలో వ్రాయబడింది. వారు మహాపండితు లు, ఉపాసకులు. అమ్మవారికి ‘నీరాజనం’ ఇస్తూ, తల్లిని రకరకాలుగా ఆవిష్కరించారు. ఆమె ధరించిన లత్తుకను, అందెలను, గాజులను, నవ్వులను, ముంగురులను, చూపులను, కుంకుమను, కురులను ఆయన వర్ణించిన తీరు ఆమెను ”సౌందర్యలహరి”గా మన ముందు నిల్పుతుంది. ”యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి/ బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం, భక్తి/ పొంగారు నీరాజనం
మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు / మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం, భక్తి/ నృత్యాల నీరాజనం
జగదేక మోహిని, సర్వేశ గౌహిని/ మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం, భక్తి/ విలువెత్తు నీరాజనం” అని ముగిస్తారు.
ఈ హారతి పాటను మనకిచ్చిన వారు ధన్యులు! గ్రహించిన మనమూ ధన్యులమే!
అమ్మవారు నవదుర్గా రూపిణియై విలసిల్లుతున్నది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్ర ఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధధాత్రి! ఇందులో కాళరాత్రిని ప్రార్థించే శ్లోకములో, ఆమె భయంకర స్వరూపిణిగా దర్శనమిస్తుంది. మిగతా ఎనిమిదీ శాంతి స్వరూపాలే. దుర్గామాత మొత్తం 18 (అష్టాదశ) పీఠములలో వెలసి ఉన్నది. వాటిని శక్తి పీఠములంటారు. ట్రింకోమలి (శ్రీలంక)లో శాంకరీదేవిగా, కంచిలో కామాక్షిగా, ప్రద్యుమ్నం (గుజరా త్)లో శృంఖలాదేవిగా, మైసూర్లో చాముండేశ్వరిగా, అలంపురం (తెలంగాణ)లో జోగులాంబగా, శ్రీశైలంలో భ్రమరాంబగా, కొల్హాపూర్‌లో (మహారాష్ట్ర)లో మహాలక్ష్మిగా, నాందేడ్ (మహారాష్ట్రలో) ఏకవీరాదేవిగా ఆమె వెలసింది. ఉజ్జయిని (ఎం. పి)లో మహాకాళిగా, ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో పురుహూతికగా, కటక్ (ఒరిస్సా)లో గిరిజగా, ఎ.పిలోని ద్రాక్షారామంలో మాణిక్యాంబగా, గౌహతి (అస్సాం)లో కామాఖ్యగా, ప్రయాగ (యు.పి)లో మాధవేశ్వరిగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాకేత్లో వైష్ణవిగా, బీహార్‌లోని గయలో మాంగల్యగౌరీదేవిగా, కాశీలో విశాలాక్షిగా, జమ్ముకాశ్మీర్‌లో సరస్వతి గా, అమ్మలగన్నయమ్మ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూంది. ఆర్యావర్త దేశమంతా విస్తరించిన ఈ అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి కరుణను దశదిశలా విస్తరిస్తున్నాయి. వీటిలో మన తెలుగు రాష్ట్రాలలోని శక్తి పీఠాలను స్మరించుకుందాం.
1. ”జోగులాంబా మహాదేవీ రౌద్రవీక్షణలోచనా
అలంపురీ స్థితామాతా సర్వార్థ ఫలసిద్ధిదా!”
(అలంపూర్-జోగులాంబ గద్వాల జిల్లా, తుంగభద్రానదీ తీరం)
2. ”శివపార్శ్వ స్థితా మాతా శ్రీశైతీ శుభపీఠికే
భ్రమరాంబా మహాదేవీ కరుణార సవీక్షణా” (శ్రీశైలం ఎ.పి) కర్నూలు జిల్లా.
3. ”పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా
పుత్రవత్పాలితాదేవీ భక్తానుగ్రహదాయినీ” (పిఠాపురం కాకినాడకు వెళ్ళేదారిలో వస్తుం ది. పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానములో అమ్మవారు వెలసింది. దాని ని పాదగయ క్షేత్రం అంటారు.
4. ”దక్షవాటీ స్థితా శక్తీ విఖ్యాతా మాణిక్యాంబికా
వరదా శుభదాదేవీ భక్తమోక్ష ప్రదాయినీ” (ద్రాక్షారామం, ఏ.పి)
అన్నీ కాకపోయినా మనకు దగ్గరలోని శక్తిపీఠాలను
దర్శించుకొని ధన్యులమవుదాం!
అమ్మలగన్నయమ్మ స్తుతి సౌరభం!
Advertisement
తాజా వార్తలు
Advertisement