Tuesday, November 26, 2024

సకల శ్రేయస్కరం… తపస్సు

నీరాహార సమీరా
హారంబులఁ జేసి చేసి యది గాక కడున్‌
ఘోరంబగు తపము నిరా
హారుండై చేసె బహుసహస్రాబ్దంబుల్‌.
తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణం, ప్రథమాశ్వాసంలోని కందపద్యం ఇది. ”మొదటి దశలో నీరు ఆహారంగా, తరువాతి దశలో సమీరం (అనగా గాలి ఆహారం గా), ఆ తరువాత మరింకేమీ దశలంటూ మిగలని ఆఖరు దశలో నిరాహారంగా (అనగా కనీసం గాలిని కూడా ఆహారంగా తీసుకోకుండా) విశ్రవసుడనే ఋషి కుమారుడు వైశ్రవణుడు ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు” అని పై పద్యం భావం. పురాణకాలంలో తప స్సులు ఇలా ఉండేవి. తపస్సులలో అతి కఠోరమైన దానిని తిక్కన ఈ వైశ్రవణుడు చేసిన తపస్సులో అక్షర రమ్యంగా వర్ణించాడు.
‘చిత్రభారతం’ అనే పేరున్న కావ్యాన్ని రచించిన చరిగొండ ధర్మన, ఆ కావ్యంలోని ద్వితీయాశ్వాసంలో (44వ పద్యం, చంపకమాల వృత్తం) తపస్సుకు కూర్చున్న ఒక ముని రూపాన్ని చక్కగా వర్ణించే ఈ పద్యం వ్రాసాడు.
కనుఁగవ యింతమూసి కరకంజము లూరుయుగంబుఁజేర్చి మే
ను నిగుడఁజేసి శ్రీవరు మనోజలజంబున నిల్పి యింద్రియా
ళిని బిగబట్టి గాడ్పుల జలింపగనీక కడంగి స్వస్తికా
సనమున నున్న తుల్యమునిచంద్రుని గాంచిరి భీతచిత్తులై.
”రెండు కళ్ళూ మూసుకుని, రెండు చేతులనూ తొడల మీదకు చేర్చి, శరీరం నిటారు గా ఉండేలా చేసి, ఏ దేవుని కరుణా కటాక్షానికి తపస్సు చేస్తున్నామో ఆ దేవుడిని మనసు నిండా నిల్పి, ఇంద్రియాలను బిగబట్టడం, అంటే మనసు చేసే ఆలోచనలను, ఊహలను నియంత్రించడం, శ్వాసను అదుపులోకి తెచ్చుకోవడం, శరీరంపై స్పర్శను గురించిన ప్రతి క్రియను పోగొట్టకోవడం, వంటి కఠోరమైన పనులను సాధించి, స్వస్తికాసనంలో కూర్చు న్న తుల్యుడు అనే మునిని భయం నిండిన మనసుతో చూశారు” అని పై పద్యం భావం.
‘తపస్సు’ అంటే సాధారణంగా మన మనసులలో మెదిలే ఊహ కూడా ఇదే. అడవు లకు వెళ్ళి ఒక నిర్జన ప్రదేశాన్ని వెదుకుకుని కూర్చుని, ఏకాగ్రచిత్తంతో ధ్యానంచేసి, ఎన్నా ళ్ళకైనా అనుకున్నది సాధించడం. అయితే తపస్సును గురించి దీనికి పూర్తిగా భిన్నమైన ఆలోచనను కూడా ఆంధ్ర మహాభారతం పాఠకుల ముందు వుంచింది. పురాణ కాలపు పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెప్పినదిగా అది నిస్సందేహంగా కనబడుతుంది. తపస్సు అంటే ఏమిటో సాక్షాత్‌ వ్యాసమహర్షి చెప్పిన మాటలలో ఆంధ్ర మహాభారతం, అరణ్యపర్వంలో ఈ క్రింది విధంగా కనబడుతుంది.
‘మనమున నింద్రియముల వ
ర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు దపం
బని చెప్పుదురు’ (అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం, 124వ పద్యంలో భాగం)
తపస్సు గురించి దుర్వాస మహామునికి ముద్గలునకు సంబంధించిన ఒక కథను వ్యాసులవారు ధర్మరాజుకు చెప్పే సందర్భంలోది పైన చూపిన పద్యంలోని భాగం. మన సులోని ఆలోచనలలో ఇంద్రియాల నడవడిని సరిగా వుండేలా చూసే ధర్మమే తపస్సు అని పెద్దల నిర్వచనం అంటాడు దుర్వాసుడు ముద్గలునితో, ముద్గల ముని గురించినదే అయిన ఒక కథలో. ఉంఛవృత్తితో (పొలాలలో రాలిన ధాన్యాన్ని గింజగింజగా ఏరుకోవ డం అనేదే జీవనోపాధిగా) జీవనం సాగిస్తూ భార్యాపిల్లలతో కాలం గడుపుతూ, పక్షం రోజులకు ఒకసారి మాత్రమే కడుపునిండా అన్నం తింటూ బ్రతుకును సాగిస్తున్న ముద్గ లుడు అనే ముని, ఆకలి మీదవున్న దుర్వాసునికి వచ్చినప్పుడల్లా అన్నం పెడతాడు. ముద్గ లుడు పెట్టిన అన్నం తృప్తి తీరా తిని, మిగినది వొంటికి కూడా పూసుకుని మరీ ఆనందపడి న దుర్వాసుడు ఇలా అంటాడు ముద్గలునితో:
‘చవులకుఁ బ్రేముడించు ననిశంబును నాలుక, దాల్మిపెంపు ధ
ర్మువును శమంబుఁ ద్రక్కొను సముద్ధతి నాకఁలి’
(అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం, 123వ పద్యంలో భాగం)
‘నాలుక అనేది సామాన్యమైనది కాదు. ఒక్కపూట అన్నం తినడం జరగకపోతే అది పెట్టే బాధ అంతాఇంతా కాదు. ప్రతిక్షణం రుచుల కోసం ఎదురుచూసి తహతహలాడు తుంది. ఆకలి అంతకంటే బలమైనది. ధర్మవర్తనాన్ని, ఓర్పుగా వుండగలగడాన్ని, క్షమ ను నశింపజేసి మనిషిని రాక్షసునిగా మారుస్తుంది. ఇంత కఠినమైన స్థితిలో ఇంద్రియాల పై నియంత్రణ సాధించడానికి చాలా శక్తి కావాలి. ఆ నియంత్రణ శక్తిని సమకూర్చేదే తప స్సు. ఏ అడవులకూ వెళ్ళకుండా, ఇంట్లోనే వుండి గృహస్థ జీవితం కొనసాగిస్తూనే నీవు సాధించింది అలాంటి తపస్సునే!’
వ్యాసులవారు ధర్మరాజుకు చెప్పిన కథ ఇది కాబట్టి, ఆయన కూడా తపస్సుకు సంబంధించిన ఈ ఆలోచనను అంగీకరించినట్లే అనుకోవాలి. అంతేకాకుండా, ‘ఈ విధమైన తపస్సును చేయడం ద్వారానే నీవు, నీ తమ్ములు సాధించదలచుకున్న విజ యాన్ని సాధించాలి’ అని కూడా ధర్మరాజుకు సలహా ఇస్తాడు.
విను నీవును నాపదలకు
మనమున నొక్కింత యోర్చి మహనీయముగా
నొనరింపుము తపము; దపం
బునన కదా సకల సౌఖ్యములు సిద్ధించున్‌. (అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం, 107వ పద్యం)
‘అనుభవిస్తున్న కష్టాలను ఓర్చుకుంటూ సాధించాల్సిన దాన్ని గురించి తపస్సు చెయ్యి. అన్ని సుఖాలు ఈవిధమైన తపస్సు వలననే సిద్ధిస్తాయి’ అని పై పద్యంలో వ్యాసులవారు చెప్పిన మాటలు అప్పుడు ధర్మరాజుకే కాదు ఇప్పుడు తన కోసమైనా, సమాజ హతం కోసమైనా ఏదైనా సాధించాలని కాంక్షించే ప్రతి మనిషికీ వర్తిస్తుంది. ఈ కాలానికి సరిపోయే తపస్సుకు అసలైన నిర్వచనం అదే! ప్రపంచానికి దూరంగా భీకరారణ్యాలలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని చేసే తపస్సు కంటే, ఇప్పుడు జనారణ్యం లో ఉంటూ, ఏకాగ్రచిత్తంతో చేసే తపస్సు మరింత కఠినమైనది. కనుక, అది సాధిం చిపెట్టే విజయాలు కూడా ఎంతో ఆస్వాదనీయంగా వుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement