ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ.. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి వనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన కూటమి నుంచి రత్న ప్రభ, కాంగ్రెస్ పార్టీ చింతామోహన్ గెలుపుకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సీఎం జగన్ సైతం ఈ నెల 14న పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం చేయనున్నారు.
అయితే, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు పంపారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. రాష్ట్రాభివృద్ధి, వాగ్దానాల అమలు, ప్రభుత్వ దార్శనికతను సీఎం ఆ లేఖలో ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. 22 నెలల పరిపాలన కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఆ లేఖల్లో ప్రస్తావించారు.