భారత్, అమెరికా సంబంధాలు ద్రుఢంగా ఉన్నాయి
ఈ ఇష్యూని ఇరు దేశాలు కలిసి పరిష్కరించుకుంటాయి
అదానీ వ్యవహారంపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా
వైట్ హౌస్ నుంచి అధికారిక వెలువడిన ప్రకటన
వ్యాపార రంగాన్ని కుదిపేసిన అదానీ లంచం కేసు
బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం
ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ దర్యాప్తు అడ్డుకునేందుకు కుట్రలు
మరోసారి స్పష్టం చేసిన శ్వేతసౌధం కార్యదర్శి కరీన్
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:
పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై కేసు విషయంలో శుక్రవారం అమెరికా స్పందించింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాధానం ఇవ్వగలవని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యాపార రంగంలో తీవ్ర ప్రకంపనలు..
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (₹2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి, వీరికి అమెరికా కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది.
అసలేం జరిగింది?
ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగంవైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్తు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు ₹2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్‌బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2బిలియన్ డాలర్లు లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆరోపించింది.
బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం..
ఈ లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. అమెరికా ఫెడరల్ కోర్టులో అదానీకి సంబంధించి ముఖ్యంగా రెండు అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడించింది. అందులో ఒకటి.. తప్పుడు సమాచారం చూపించి 2 బిలియన్ డాలర్ల మేర రుణాలకు అర్జీ పెట్టడం.. కాగా రెండోది.. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని మదుపర్లకు 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ఆఫర్ చేయడం వంటివి ఉన్నాయని తెలిపింది.
ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ దర్యాప్తు అడ్డుకునే కుట్రలు..
ఈ రెండు అభియోగాలపై న్యూయార్క్‌లోని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదానీ సహా ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అజురా పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో తాము నోటీసులు పంపించినట్టు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) వెల్లడించింది. ఈ కేసులో నిందితులు ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్టు కోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.