Friday, November 22, 2024

పెద్ద సంఖ్యలో వందేభారత్‌ రైళ్లు.. మరో మూడు కోచ్‌ ఫ్యాక్టరీల్లో తయారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా ఆ రైళ్ల సంఖ్యను పెద్ద మొత్తంలో పెంచాలని భారతీయ రైల్వే శాఖ యోచిస్తున్నది. ఈ సంఖ్యను వీలైనంత త్వరగా వందకు చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ 30 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉన్న మిగతా రైళ్లతో పోలిస్తే వందేభారత్‌లో విలాసవంతమైన సౌకర్యాలతో పాటు గమ్యాన్ని వేగంగా చేరుకునేందుకు వేగం సామర్ధ్యాన్ని సైతం గణనీయంగా పెంచారు. దీంతో ప్రయాణికులు కొంత చార్జీ ఎక్కువైనప్పటికీ వందేభారత్‌ రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు.

దీంతో వచ్చే రెండేళ్లలోపే భారత్‌లో వంద వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ ముందుగా భావించినప్పటికీ వచ్చే ఏడాది ఎన్నికల జరుగనున్న దృష్ట్యా ఈలోగానే తయారీ పూర్తి చేయాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులకు కేంద్రం నుంచి సూచనలు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో మాత్రమే వందే భారత్‌ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలోనే వంద రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించిన దృష్ట్యా మరో మూడు కోచ్‌ ఫ్యాక్టరీల్లో వాటి ఉత్పాదనను ప్రారంభించనుంది.

ఇప్పటికే ఏ నగరంలో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పాలనే ఆలోచనలో రైల్వే శాఖ అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కో రైలు తయారీ పూర్తి కావడానికి దాదాపు 8 నుంచి ఏడాది పడుతోంది. ప్రొడక్షన్‌ వేగం పుంజుకునే వరకు ఒక రైలుకు వినియోగించే 16 కోచ్‌లను రెండు రైళ్లుగా మార్చి నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరిగే కొద్దీ రైళ్ల సంఖ్యను పెంచడంతో సమయం కలసి వస్తుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

మరో రెండు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తే ఈ తయారీ సమయం ఆదా అవుతుందని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 6న ప్రారంభం కావాల్సిన కాచిగూడ-యశ్వంతాపూర్‌ (బెంగళూరు) రైలు సెప్టెంబర్‌ మొదటి వారంలో పట్టాలపైకి రానుందని సమాచారం. మహబూబ్‌నగర్‌ మీదుగా దీని ట్రయల్‌ రన్‌ ఇప్పటికే పూర్తయినప్పటికీ సాంకేతిక కారణాలతో ఈ రైలు ప్రారంభాన్ని ద.మ.రైల్వే అధికారులు వాయిదా వేశారు. దీంతో పాటు మరో నాలుగు రైళ్లు సిద్ధంగా ఉండటంతో అన్నింటినీ కలిపి ఒకేసారి ప్రారంభించే యోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement