హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. పోలీసు శాఖతో పాటు ఎక్సైజ్, రవాణా, ఎస్‌పీఎఫ్, అగ్నిమాపక శాఖలలోని ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం శాఖలలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలు 587, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు 16,929, మొత్తం 17,516 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నారని నియామక బోర్డు వెల్లడించింది. ఇందులో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు 2.47 లక్షలు కాగా, కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. వీటిల్లో 3,55,679 మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. వచ్చిన దరఖాస్తులలో 2,76,311 మంది మహిళా అభ్యర్థులున్నారని తెలిపింది. 52 శాతం కేవలం ఒక్క పోస్టుకే దరఖాస్తు చేసుకోగా, 29 శాతం మంది రెండు పోస్టులకు, 15 శాతం మంది మూడు పోస్టులకు, నాలుగు పోస్టులకు 3 శాతం దరఖాస్తులు, అయిదు పోస్టులకు ఒక శాతం దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది. కేటగిరిల వారిగా పరిశీలిస్తే ఓసీలు 7.65 శాతం, బీసీ ఏకు చెందిన వారు 8.27 శాతం, బీసీ బికి చెందిన వారు 17.70 శాతం, బీసీ సీకి చెందిన వారు 0.26 శాతం, బీసీ డికి చెందిన వారు 20.97 శాతం, బీసీ ఈకి చెందిన వారు 4.11 శాతం, ఎస్సీలు 22.44 శాతం, ఎస్టీలు 18.60 శాతం ఉన్నారని వివరించారు.
మొత్తంగా బీసీలు 51 శాతం, ఎస్సీ, ఎస్టీలు 41 శాతం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఓసీ కేటగిరీలో వచ్చిన దరఖాస్తులలో 3.48 ఇతర రాష్ట్రాలకు చెందిన వారి దరఖాస్తులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులలో 33 శాతం దరఖాస్తులు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట జిల్లాలవేనని, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి కేవలం 7 శాతం దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 వ తేదీ నుంచి మొదలు పెట్టి 26 వ తేదీతో ముగించామని, అత్యధికంగా 19 వ తేదీన లక్షా 1,13,180 దరఖాస్తులు రాగా, 20 వ తేదీన 1,03,26 అందాయని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు 20,863 దరఖాస్తులు రాగా 22 వ తేదీన కేవలం 11,786 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 67 శాతం మంది తెలుగులో, ఇంగ్లీషులో 32.8 శాతం, ఉర్ధూలో కేవలం 0.2 శాతం మంది పరీక్ష రాస్తామని దరఖాస్తులలో పేర్కొన్నట్లు తెలిపారు. ఎస్‌ఐ, ఎఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న రెండున్నర లక్షల మందికి ఆగస్టు 7 వ తేదీన, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 6.6 శాతం మందికి ఆగస్టు 21 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పులున్నా తర్వాత తెలియజేస్తామని నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..