Thursday, November 7, 2024

ఒకే ప్రాంగణంలో 54 దేవాలయాలు.. 84 దేవతామూర్తులు..

కోరుకొండ : తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఓం శివ శక్తి పీఠం విశిష్టమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఒకే ప్రాంగణంలో 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులు కొలువై ఉన్న ఈపీఠంలో శైవ, ఆగమ సాంప్రదాయాలతో నిత్యం పూజలు జరుగుతున్నాయి. కార్తీకమాసం పర్వదినం కావడంతో పీఠాన్ని దర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పీఠంలో ఉమామహేశ్వర నిత్య అన్నదానం, శ్రీ ఉమామహేశ్వర ఆధ్యాత్మిక కల్యాణ మండపం, ధ్యాన పిరమిడ్, గోశాల, పుణ్య పుష్కరిణి, యాగశాల, 27 నక్షత్ర వనములు, గ్రహవనము ఉన్నాయి. కార్తీకమాసం సందర్భంగా విశేష అన్నదానం నిర్వహిస్తున్నారు.

పీఠం ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మహాచండీ హోమం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, జ్వాలాతోరణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతీయ రహదారికి సమీపంలో మురారి నుండి సీతారాంపురం కలవచర్ల మీదుగా గాదరాడ పీఠానికి చేరుకోవచ్చు. అదేవిధంగా మండల కేంద్రమైన కోరుకొండ నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో పీఠం ఉంది. కార్తీక మాసం కావడంతో పీఠంలో ఉన్న తారకేశ్వరస్వామి దర్శించేందుకు భక్తులు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement