Saturday, November 23, 2024

లక్కీ డ్రా.. లాస్‌ గ్యారెంటీ!

కేవలం రూ.500 కడితే చాలు, లక్కీ డ్రాలో రూ.లక్ష విలువైన బైక్‌, రూ.2 లక్షల విలువైన టీవీ మీ సొంతం కావొచ్చు. ఆ అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు!.. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో డబ్బులు కట్టించుకొని, డిపాజిట్లు కోట్లకు చేరగానే బిచాణా ఎత్తేస్తున్నారు కేటుగాళ్లు. ఉత్తర తెలంగాణలో ఒకచోట మొదలై అన్ని జిల్లాలకు వ్యాపిస్తున్నదీ బోగస్‌ దందా. ఉచితంగా లాభాలు వస్తాయని నమ్మితే నిండా మునుగుడు ఖాయమనేందుకు ప్రస్తు తం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో విస్తరిస్తున్న లక్కీ డ్రా ఉదంతమే నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం లక్కీ డ్రాలపై నిషేధం విధించింది. గొలుసుకట్టు దందాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం కనిపించకుండాపోయింది. దీంతో మోసగాళ్లు ఎంటర్‌ప్రైజెస్‌ల పేరుతో రిజిస్టర్‌ చేసుకొని అక్రమ దందా మొదలుపెడుతున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో సామాన్యులను బుట్టలో వేసుకుంటున్నారు. ఏజెంట్లను సైతం నియమించుకొని ప్రతి సభ్యుడి నుంచి రూ.500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. నెలకోసారి, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి లక్కీడ్రా తీస్తామంటూ సభ్యులను పెంచుకుంటూపోతున్నారు. సభ్యుల విశ్వాసం పొందేందుకు మొదట్లో లక్కీ డ్రా తీసి కొంతమందికి బహుమతులు ఇచేస్తున్నారు. పెద్ద మొత్తంలో సభ్యులు చేరి, భారీగా సొమ్ము చేతికందగానే బోర్డు తిప్పేస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో లక్కీ డ్రాల వ్యాపారం రూ.వందల కోట్లు దాటి ఉండొచ్చని అంచనా. ఇటీవల బిచాణా ఎత్తేసిన ఓ సంస్థ కార్యాలయం కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఉండేదన్న ఆరోపణలు వచ్చాయి.


నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బోర్డు తిప్పేసిన షైన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.10 కోట్ల వరకు వసూలుచేసి 3 వేలమందిని రోడ్డు పాల్జేసింది. షైన్‌ ఎంటర్‌ప్రైజేస్‌ పేరుతో 4 లక్కీ డ్రాలు నడుస్తుండగా 10 వేల మంది బాధితులున్నట్టు గతంలోనే పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌ నగరంలో పురుడు పోసుకున్న ఈ వ్యాపారం నిర్మల్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు పాకింది.

కామారెడ్డి జిల్లాలో ఈ దందాను బహిరంగంగానే నడిపిస్తున్నారు. ప్రజల బలహీనతలే ఆసరాగా ఆయా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నప్పటికీ పోలీసులు 420 కేసులు పెట్టి వదిలేయడంతో, మరోచోట మళ్లీ మొదలుపెడుతున్నారు. బీర్‌షెబా పేరుతో వందల కోట్ల రూపాయల మోసం వెలుగుచూసి ఏడాదిన్నర కూడా కాకముందే ఇప్పుడు లక్కీడ్రాల పేరుతో మోసగాళ్లు కొత్త దుకాణాలు తెరిచారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు అడ్డాగా పురుడు పోసుకుంటోన్న ఈ మోసాలు దాదాపు ఉత్తర తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఆరునెలల క్రితం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించి పలువురు నిందితులను పట్టుకున్నాయి. స్టేషన్‌ బెయిల్‌పై వారిని వదిలిపెట్టడంతో నిర్వాహకులు తిరిగి ఇదే వ్యాపారం చేస్తున్నారు.

- Advertisement -

‘లక్కీ డ్రా నిర్వాహకుల వలకు చిక్కి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు ముందుకొచ్చి మోసాలపై ఫిర్యాదు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కామారెడ్డి డీఎస్పీ సోమనాథ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement