Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం – 4(ఆడియోతో…)

పద్మపురాణములోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విరవణ..

కుకర్మా చరణాత్‌ సార: సర్వతో నిర్గతోధునా
పదార్ధా: సంస్థితా భూమౌ బీజహీనా: తుషాయధా

భక్తి వృద్ధులు, బలహీనులుగా ఉన్న జ్ఞాన వైరాగ్యములను ఇద్దరు కుమారులను తన ముందు ఉంచుకొని విలపిస్తుండగా అటు నుండి వెళ్తున్న నారదుడు భక్తిని చూసి ఎవరు నీవు ఎందుకు విలపిస్తున్నావని అడుగగా భక్తి భూలోకంలో జ్ఞానవైరాగ్యాలకు తావు లేకుండా పోయినందున వీరిలా అలమటిస్తున్నారని వీరిని ఉద్ధరించమని కోరెను. అపుడు నారద మహర్షి భక్తితో ఇలా పలికెను. ‘యుగోయం దారుణ: కలి:’ అనగా ఇది భయంకరమైన కలియుగం. ఈ యుగంలో జ్ఞాన వైరాగ్యాలను ఎవరు ఆదరించరు. పరీక్షిత్తు కలిని నిగ్రహించినా కలి ప్రార్థనతో వధించకుండా కొన్ని స్థానాలిచ్చి ఉంచాడు కావున నీకిలాంటి స్థితి ఏర్పడిందని నారదుడు చెప్పెను. కలి వస్తే మాత్రం తీర్థములు, క్షేత్రములు, కథలు, వస్తువులలో ఉన్న సారం ఎలా నశిస్తుందని, కలి సారాన్ని అపహరిస్తారా అని భక్తి ప్రశ్నించగా చెడు కర్మలు ఆచరించడం వలన అన్నింటిలోని సారం నశించిందని నారదుడు బదులిచ్చెను.

ఇప్పుడు భూలోకములో ఉన్న అన్ని పదార్థాలు విత్తులు లేని తాలు ధాన్యం వలె ఉన్నవి. అంటే ఏ వస్తువైనా సారవంతం, సారహీనం అనేది ఆ ప్రాంతంలో ఉన్న మానవుల ఆచరణను బట్టి ఉంటుంది. దేవాలయం నిర్మించి దేవతను ప్రతిష్టించినపుడు ఆ దైవానికి నిత్యారాధన ఉండాలి లేకుంటే ఆ దైవం ప్రభావ హీనుడై గ్రామాలను, ప్రజలను కాపాడాల్సింది పోయి అతివృష్టి, అనావృష్టితో బాధలు పాలు చేస్తాడు. నిత్యారాధన శాస్త్రోక్తంగా, శ్రద్ధా భక్తులతో చేయని నాడు ప్రతిష్టించిన దైవం ప్రభావాన్ని కోల్పోతాడు. చదువుకున్న ఉపాధ్యాయుడైనా విద్యార్థులకు సరిగ్గా బోధించకుంటే జ్ఞానం బదులు అజ్ఞానం వస్తుంది. ఎంత గొప్ప సారమున్న వస్తువైనా ఆ వస్తువును ఉపయోగించే విధంగా ఉపయోగించకుంటే అది సారాన్ని కోల్పోతుంది. పాలు మంచివైనా కాచి తగిన రక్షణతో ఉంచినపుడే వాడుకోగలము. వస్తువు నిజమైన సారం పొందాలంటే దానిని శ్రద్ధాభక్తులతో, సత్య ధర్మములతో కాపాడి ఉపయోగించాలి లేకుంటే అని నశిస్తుంది.

- Advertisement -

కలియుగంలో సారవంతములు చాలా ఉన్నా శ్రద్ధాభక్తులతో, సత్కర్మతో వాటిని రక్షించి ఉపయోగించే వారు లేరని భావం. అనాదిగా మానవులు అదే అన్నం, పాలు, నీళ్లు వాడుతున్నా నాటి ఆరోగ్యం, బలం, ధర్మప్రవృత్తి సన్నగిల్లాయి. దీనికి కారణం వస్తువులలో సారం లేకపోవటం కాదు ఉపయోగించే వారిలో శ్రద్ధ లేకుండా పోవడమని ఇందులోని ఋషి హృదయం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement