అధ్యాయం 6, శ్లోకం 7
జితాత్మన: ప్రశాంతస్య
పరమాత్మా సమాహిత: |
శీతోష్ణసుఖదు:ఖేషు
తథా మానావమానయో: ||
తాత్పర్యము : మనస్సునను జయించినవాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదు:ఖములు, శీతోష్ణములు, మానాపమానములు అన్నియును సమానములే అయియున్నవి.
భాష్యము : మనస్సు గనక భౌతికమైన మోహశక్తి వలన దారి మళ్ళింపబడినట్లయితే భౌతిక కార్యాలలో చిక్కుకుంటుంది. అలాకాక ఏదేని యోగ పద్ధతి ద్వారా ఉన్నత నిర్దేశాలను పాటిస్తూ మనస్సు నియంత్రింపబడినట్లయితే చలి, వేడి, సుఖము, దు:ఖము అనే భౌతిక ద్వంద్వాలకు అతీతముగా జీవి నిలువగలుగుతాడు. కాబట్టి మన స్సుకు శిక్షణ ఇచ్చి ఉన్నత ఆదేశాలను పాటించునట్లు చేయుట అత్యావశ్యకము. అది జీవి యొక్క సహజ స్థితి అయిన పరమాత్మను పాటించుటతో సమానము. అనగా కృష్ణ చైతన్యములో ఉన్న వ్యక్తి సమాధి లేదా భగవంతుని ధ్యానములో నిమగ్నమైనట్లే లెక్క. అటువంటి వ్యక్తి ద్వంద్వాలకు అతీతుడు గానే నిలుస్తాడు.