రాజీనామా చేస్తారా..గుడ్‌బై చెప్తారా..?
- కొండాకు హైకమాండ్ డెడ్‌లైన్
- సాయంత్రం వరకు రాజీనామా చేయాలని మంత్రి కొండా సురేఖకు అల్టిమేటం
- లేదంటే లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక
- రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే రాజీనామా చేసే అవకాశం
- బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్న కొండా సురేఖ
- పునరాలోచించాలని కోరినా కొండా సురేఖకు దక్కని ఊరట
- మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఏఐసీసీ (AICC) నాయకత్వం, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
కొండా సురేఖ స్వచ్ఛందంగా గురువారం సాయంత్రంలోగా తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించాలని హైకమాండ్ గడువు విధించింది. ఒకవేళ ఆమె అధిష్ఠానం మాటను కాదని రాజీనామాకు నిరాకరిస్తే, కేబినెట్ నుండి ఆమెను బర్తరఫ్ చేస్తూ గవర్నర్‌కు అధికారికంగా లేఖ పంపుతామని హెచ్చరించినట్లు సమాచారం
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశంలో కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయానికి చేరువైనట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయించాలని లేదా ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలని పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఆగస్టు 19న వరంగల్ జిల్లా గీసుకొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదికను ఏఐసీసీ నాయకత్వానికి సమర్పించినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే అధికారం తనకు ఇవ్వాలని కూడా కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అయితే బుధవారం రాత్రి వరకు అధిష్ఠానం నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. రాహుల్‌గాంధీ నాశిక్ పర్యటన నుంచి ఢిల్లీకి ఆలస్యంగా చేరడంతో నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండి గురువారం రాహుల్‌గాంధీతో సమావేశం కావాలని అధిష్ఠానం సూచించినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. దీంతో గురువారం జరిగే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
ఖర్గేను కలిసిన సురేఖ
మరోవైపు కొండా సురేఖ మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలు, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తన వివరణను వారికి అందించారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె వాదించినట్లు సమాచారం. అంతేకాకుండా తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని కూడా పార్టీ పరిశీలించాలని సురేఖ కోరారు.
పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరికీ ఒకే విధమైన ప్రమాణాలు వర్తింపజేయాలని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి భవిష్యత్తులో పదవిలో కొనసాగడం, తదుపరి ఎన్నికల అభ్యర్థులపై చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ అధిష్ఠానం ఆమెను కనికరించలేదు. మంత్రి పదవికి సాయంత్రం లోపు రాజీనామా చేయాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది.
రాజీనామా చేస్తారా.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారా?
ఇదిలా ఉండగా.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు బలపడుతున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. కొన్ని వర్గాలు ఆమె రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని చెబుతుండగా.. మరికొన్ని వర్గాలు ఆమె పార్టీని వీడే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. కొండా దంపతులు గురువారం తమ తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. మధ్యాహ్నం సమావేశం అనంతరం ప్రకటన ఉండొచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆలోపే ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో సురేఖపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది.
