Ukraine-Relations-Europe-Support : ఐరోపా అండ….Andhra Prabha Top Story
Ukraine-Relations-Europe-Support : ఐరోపా అండ….Andhra Prabha Top Story
- ఉక్రెయిన్ కు భరోసా
- రఫ్యా పై మరిన్ని ఆంక్షలు
- నాటో దేశాల మద్దతు…
- ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ మరోసారి ఫైర్
- అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందంతో కుదుపు
- పుతిన్ కంటే జెలెన్‌స్కీతోనే కష్టం!
- రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు సిగ్గుచేటు
- ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ మరోసారి ఫైర్
- వాషింగ్టన్-కీవ్ మధ్య మరింత దూరం
( వాషింగ్టన్/బ్రస్సెల్స్ , ఆంధ్రప్రభ ప్రతినిధి)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోలిస్తే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వ్యవహరించడమే ఎక్కువ కష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై అసంతృప్తితో ఉన్న ట్రంప్.. తాజాగా రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ జరుపుతున్న దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దాడులు ‘సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. దీంతో అమెరికా-ఉక్రెయిన్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికాలో ఇంధన ధరలు పెరిగిన వేళ.. రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు వాషింగ్టన్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామం జెలెన్‌స్కీకి ఆగ్రహం తెప్పించింది. మరోవైపు, రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతుండటంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అంశాలూ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి.
‘జెలెన్‌స్కీతో కష్టమే’
అమెరికా మీడియా సంస్థ న్యూస్‌మ్యాక్స్‌కు గురువారం రాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ జెలెన్‌స్కీపై విమర్శలు గుప్పించారు. ‘‘నేను జెలెన్‌స్కీకి పెద్ద అభిమానిని కాదు. ఆయనతో వ్యవహరించడం మాకు అంత అనుకూలంగా లేదు’’ అన్న ధోరణిలో మాట్లాడారు. ‘‘ఆయన యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదు. ముగిస్తానని చెబుతారు.. కానీ ఆ దిశగా వ్యవహరించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరూ పరస్పరం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒప్పందానికి రావడం కష్టమని పేర్కొన్నారు.రష్యాతో శాంతి ఒప్పందం దిశగా ముందుకు వెళ్లాలన్న తన ప్రయత్నాలకు ఉక్రెయిన్ సహకరించడం లేదన్న అసంతృప్తి ట్రంప్ వ్యాఖ్యల్లో కనిపించింది. అయితే, జెలెన్‌స్కీ మాత్రం యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు.
చమురు కేంద్రాలపై దాడులే అసలు వివాదం!
రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ తాజాగా దాడులు పునఃప్రారంభించడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఇదంతా సిగ్గుచేటు. ఆయన చేస్తున్నదంతా ప్రపంచ చమురు ధరలను పెంచడమే. దాడి చేయడానికి ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలంటూ ట్రంప్ కోరడంతో.. జెలెన్‌స్కీ మూడు రోజులపాటు ఆ దాడులకు విరామం ఇచ్చారు. అయితే, రష్యా మాత్రం తన దాడులను ఒక్క నిమిషం కూడా ఆపలేదని ఆరోపిస్తూ గురువారం నుంచి తిరిగి దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు.
మాస్కో మాత్రం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల విరమణకు తాము ఎప్పుడూ అంగీకరించలేదని చెబుతోంది. దీంతో కాల్పుల విరమణపై అమెరికా ప్రకటనకు, రష్యా వైఖరికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు ఆ దేశ ఇంధన ఎగుమతుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో అమెరికా-రష్యా మధ్య కుదిరిన డీజిల్ ఒప్పందానికి కూడా అవి ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఉక్రెయిన్‌పై మరింత తీవ్రంగా స్పందిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పుతిన్‌కు బహుమతా?.. జెలెన్‌స్కీ ఆగ్రహం
రష్యా నుంచి 3 లక్షల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం ఉక్రెయిన్‌కు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ ఒప్పందం పుతిన్‌కు బహుమతిగా మారుతుందని జెలెన్‌స్కీ విమర్శించారు. ముగించాల్సిన యుద్ధాన్ని పొడిగించేందుకు పెట్టుబడి పెట్టినట్లుగా ఈ నిర్ణయం ఉందని ఆక్షేపించారు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఇంధన ధరలు, ముఖ్యంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినట్లు కథనం పేర్కొంది. దీంతో అమెరికా ప్రజల్లో ట్రంప్ పట్ల అసంతృప్తి పెరిగే పరిస్థితి ఏర్పడింది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడం ఆయనకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై ట్రంప్ దృష్టి సారించగా.. రష్యా ఇంధన వ్యవస్థపై ఉక్రెయిన్ దాడులు అమెరికా ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫలితంగా కీవ్‌పై వాషింగ్టన్ ఒత్తిడి పెరుగుతోంది.
ఉపగ్రహ సమాచార వ్యవస్థపైనా ఆంక్షలు!
అమెరికా-ఉక్రెయిన్ మధ్య విభేదాలు చమురు ఒప్పందానికే పరిమితం కాలేదు. యుద్ధభూమిలో ఉక్రెయిన్ సైన్యానికి కీలకమైన ఉపగ్రహ సమాచార వ్యవస్థల వినియోగంపై ఆంక్షలు విధించడం కూడా ఉద్రిక్తతలకు కారణమైంది.మంగళవారం రాత్రి ఈ సమాచార వ్యవస్థపై పరిమితులు విధించిన సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా పలు ప్రాణాంతక దాడులకు పాల్పడినట్లు స్థానికులు, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే దాడులపై ముందస్తు హెచ్చరికలు అందలేదని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేయకపోతే.. తమ వద్ద ఉన్న కీలక నిఘా సమాచారాన్ని పంచుకోవడాన్ని కూడా నిలిపివేయవచ్చని ట్రంప్ ప్రభుత్వం గతంలో హెచ్చరించినట్లు కథనం వెల్లడించింది. యుద్ధంలో రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా అందించే నిఘా సమాచారం కీవ్‌కు అత్యంత కీలకం. అలాంటి సహకారంపై పరిమితులు విధిస్తే ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఉక్రెయిన్‌కు యూరప్ భరోసా
అమెరికా అధ్యక్షుడి విమర్శలపై జెలెన్‌స్కీ నేరుగా స్పందించకపోయినా.. యూరోపియన్ యూనియన్ నేతల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఈయూ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఆయనకు స్వాగతం పలికారు ‘ట్రంప్ ప్రకటించిన ఇంధన దాడుల విరమణకు మేం మద్దతు ఇచ్చాం. కానీ రష్యా దానిని గౌరవించలేదు. ఒక్క నిమిషం కూడా ఆగలేదు’’ అని వాన్ డెర్ లేయెన్ స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కోస్టా సైతం ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుకునే సమయం ఇది కాదని, రష్యాపై ఆంక్షలను సడలించకూడదని స్పష్టం చేశారు. అమెరికా రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. శుక్రవారం సమావేశంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం, రాబోయే శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ ఎదుర్కోబోతున్నది ఐదో శీతాకాలం.
విద్యుత్, నీటి వ్యవస్థలే లక్ష్యం
ఉక్రెయిన్ ఇంధన, నీటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని వాన్ డెర్ లేయెన్ ఆరోపించారు. గత శీతాకాలాల్లో మాదిరిగానే ఈసారి కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.‘‘మా దేశం ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని కోరుకుంటోంది. కానీ రష్యా కూడా అదే కోరుకుంటోందన్న సంకేతాలు కనిపించడం లేదు’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అందుకే శీతాకాలానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.‘‘శీతాకాల సన్నద్ధత అంటే కేవలం ఇంధనం మాత్రమే కాదు. రక్షణ, ఆర్థిక సహాయం కూడా అవసరం’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా డ్రోన్ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రాంతమైన వోలిన్‌లో జరిగిన దాడుల కారణంగా సుమారు 2.7 లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు గవర్నర్ వెల్లడించారు.
రష్యాపైనా ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు
మరోవైపు, రష్యాలోనూ ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు కొనసాగుతున్నాయి. మాస్కోతోపాటు 26 ప్రాంతాల గగనతలంలో 644 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాస్కో వైపు వచ్చిన 94 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు నగర మేయర్ తెలిపారు. మాస్కోలో విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని గంటలపాటు గగనతలాన్ని మూసివేసినట్లు సమాచారం. మాస్కోకు తూర్పున ఉన్న వ్లాదిమిర్ ప్రాంతంలో తాపన మౌలిక సదుపాయాలపై దాడులను అడ్డుకునేందుకు డ్రోన్లను కూల్చివేసినట్లు గవర్నర్ వెల్లడించారు.దక్షిణ రోస్తోవ్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్లు పారిశ్రామిక, గిడ్డంగుల సముదాయాలను తాకడంతో మంటలు చెలరేగాయని, ఒకరు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
యుద్ధం దారి ఎటు?
ఒకవైపు యుద్ధాన్ని త్వరగా ముగించాలని జెలెన్‌స్కీ చెబుతుండగా.. మరోవైపు రష్యాతో ఇంధన ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలని యూరప్ పట్టుబడుతోంది. రష్యా మాత్రం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల విరమణకు అంగీకరించలేదని చెబుతోంది. ఈ పరిణామాలన్నీ యుద్ధ పరిష్కారాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా-రష్యా మధ్య ఇంధన వాణిజ్యం ఒకవైపు.. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక మద్దతు మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి సమతూకం పాటిస్తుందన్నది కీలకంగా మారింది.
పుతిన్ కంటే జెలెన్‌స్కీతోనే వ్యవహరించడం కష్టమన్న ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో పెరుగుతున్న అగాధానికి మరో సంకేతంగా కనిపిస్తున్నాయి. యుద్ధం ముగింపునకు దౌత్యం దారి తీస్తుందా? లేక ఇంధన ప్రయోజనాలు, సైనిక వ్యూహాల మధ్య సంఘర్షణ మరింత తీవ్రమవుతుందా? అన్నది వేచి చూడాలి.
