Ukraine-fp-7-Ballistic-Missile : మాస్కో..కాస్కో ! Andhra Prabha Top Story

Ukraine-fp-7-Ballistic-Missile : మాస్కో..కాస్కో ! Andhra Prabha Top Story

  • ఉక్రెయిన్ బీఎం స‌వాల్
  • ఎఫ్‌పీ-7 బాలిస్టిక్‌ మిసైల్‌ అభివృద్ధి
  • ఏటీఏసీఎంఎస్‌కు ప్రత్యామ్నాయం
  • ఉక్రెయిన్‌ కొత్త వెప‌న్
  • ఎఫ్‌పీ-9తో 850 KM లక్ష్య ఛేదన

(కీవ్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌)

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఉక్రెయిన్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యూహాత్మక బాలిస్టిక్‌ క్షిపణి ఎఫ్‌పీ-7పై దృష్టి సారించింది. ఈ క్షిపణిని యుద్ధంలో వినియోగించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించినప్పటికీ.. ఎక్కడ, ఏ లక్ష్యంపై ప్రయోగించారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

రష్యా క్షిపణి దాడులకు ప్రతిస్పందన

మాస్కోతో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా తరచూ బాలిస్టిక్‌ క్షిపణులతో ఉక్రెయిన్‌ లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ముప్పును ఎదుర్కొనేందుకు స్వదేశీ వ్యూహాత్మక క్షిపణుల అభివృద్ధిని ఉక్రెయిన్‌ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఉక్రెయిన్‌ సంస్థ ఫైర్‌ పాయింట్‌ అభివృద్ధి చేస్తున్న ఎఫ్‌పీ-7 క్షిపణిని సైనిక విశ్లేషకులు అమెరికా ఆర్మీ వినియోగించే ఏటీఏసీఎంఎస్‌ (ATACMS)తో పోలుస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా అమెరికా క్షిపణులను పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందించాయి. అయితే ఎఫ్‌పీ-7 తక్కువ వ్యయంతో తయారవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా స్థావరాలే లక్ష్యం?

రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌పీ-7 అభివృద్ధిని వేగవంతం చేసినట్లు ఫైర్‌ పాయింట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణుల మోహరింపుతో రష్యా క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆయుధ తయారీ స్థావరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉక్రెయిన్‌కు పెరుగుతుందని సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎఫ్‌పీ-9తో మరింత దూరం

ఫైర్‌ పాయింట్‌ మరో శక్తివంతమైన ఎఫ్‌పీ-9 క్షిపణి అభివృద్ధి చేస్తోంది. ఇది దాదాపు 850 కిలోమీటర్ల (528 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇది సిద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎఫ్‌పీ-7, ఎఫ్‌పీ-9 రెండు క్షిపణులు అందుబాటులోకి వస్తే.. రష్యా యుద్ధ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేట్రియట్‌కు బ‌దులు ‘ఫ్రెయా’

మరోవైపు వైమానిక రక్షణ వ్యవస్థల విషయంలోనూ ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాలతో కలిసి ముందుకు సాగుతోంది. అమెరికా పేట్రియట్‌ వ్యవస్థకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయంగా యూరప్‌ దేశాలతో కలిసి ‘ఫ్రెయా’ అనే యాంటీ బాలిస్టిక్‌ రక్షణ వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. జూలైలో ఉక్రెయిన్‌, దాని కీలక పశ్చిమ మిత్రదేశాలు ఈ వైమానిక రక్షణ కూటమికి అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది తొలి భాగంలో ఫ్రెయా వ్యవస్థ ప్రోటోటైప్‌ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉక్రెయిన్‌ జాతీయ భద్రత, రక్షణ మండలి డిప్యూటీ కార్యదర్శి డేవిడ్‌ అలోయన్‌ తెలిపారు రష్యా క్షిపణి ఆధిపత్యానికి ప్రతిస్పందనగా.. స్వదేశీ క్షిపణులు, కొత్త రక్షణ వ్యవస్థలతో ఉక్రెయిన్‌ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుంటోంది.