Ukraine-Drone-Strike : రష్యా హార్ట్ ఎటాక్‌ ..! Andhra Prabha Top News

Ukraine-Drone-Strike : రష్యా హార్ట్ ఎటాక్‌ ..! Andhra Prabha Top News

  • క్రెమ్లిన్ టెక్‌ దిగ్గజం కుదేల్
  • డిజిటాల్ గుండెపై ఉక్రెయిన్ డ్రోన్ల దెబ్బ!
  • యాండెక్స్‌ డేటా కేంద్రం బంద్‌
  • పలు సేవలకు అంతరాయం.

(మాస్కో: ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి)

యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ప్రత్యర్థి దేశ ఆర్థిక మూలాలను, సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీసే దిశగా రష్యా–ఉక్రెయిన్‌ పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా రష్యా టెక్నాలజీ దిగ్గజం యాండెక్స్‌ డేటా కేంద్రంపై ఉక్రెయిన్‌ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మాస్కోకు తూర్పున ఉన్న వ్లాదిమిర్‌ ప్రాంతంలోని కేంద్రం దెబ్బతినడంతో సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ వారంలో యాండెక్స్‌ కేంద్రాలపై జరిగిన మూడో దాడి ఇది. ఈ పరిణామంతో సంస్థకు చెందిన కొన్ని డిజిటల్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.

రష్యాకు గూగుల్‌గా పేరొందిన యాండెక్స్‌.. సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు ఆహార పంపిణీ, ట్యాక్సీ సేవలు సహా అనేక డిజిటల్‌ వేదికలను నిర్వహిస్తోంది. వీటిని లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. వ్లాదిమిర్‌లోని డేటా కేంద్రంపై దాడిలో ఎవరూ గాయపడలేదని సంస్థ వెల్లడించింది. అయితే కేంద్రం దెబ్బతినడంతో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, సేవలకు కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

వారంలో మూడో దెబ్బ..

యాండెక్స్‌కు చెందిన ఐదు డేటా కేంద్రాల్లో ఇప్పటికే రెండింటిపై దాడులు జరగడంతో సేవలను యథావిధిగా కొనసాగించడం కష్టమవుతోందని సంస్థ ఈ వారం ప్రారంభంలోనే వెల్లడించింది. గురువారం మాస్కోకు ఆగ్నేయ దిశలోని ససోవోలో, శుక్రవారం నైరుతి దిశలోని కలుగాలో ఉన్న కేంద్రాలు దాడులకు గురయ్యాయి. తాజాగా ఆదివారం వ్లాదిమిర్‌లోని కేంద్రంపైనా దాడి జరగడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాండెక్స్‌ సేవల సాధారణ నిర్వహణకు డేటా కేంద్రాలు కీలకమని సంస్థ పేర్కొంది. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ, సేవలు ఎప్పటిలోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమని తెలిపింది.

చమురు కేంద్రాలపై దాడులొద్దు : ట్రంప్‌..

యాండెక్స్‌ కేంద్రంపై దాడికి కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని సూచించారు. అయితే, దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకునే చర్యలు పరస్పరం ఉండాలని, వాటికి విశ్వసనీయమైన హామీలు కూడా అవసరమని స్పష్టం చేశారు. రష్యా తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తే, తాము కూడా రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులను ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఏకపక్షంగా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న సంకేతాలిచ్చారు.

అమెరికా–రష్యా ఒప్పందంపై కీవ్‌ అసంతృప్తి..

రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు విడుదల చేసేలా కుదిరిన కొత్త ఒప్పందంపై జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రంప్‌ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో మౌలిక సదుపాయాలే కీలక లక్ష్యాలుగా మారాయి. మాస్కో యుద్ధ యంత్రాంగానికి ఆదాయాన్ని సమకూర్చే వ్యవస్థలను దెబ్బతీయడమే తమ దాడుల లక్ష్యమని కీవ్‌ చెబుతోంది. యాండెక్స్‌ వంటి కీలక సంస్థలపై దాడుల వల్ల రష్యా తన వనరులను మరమ్మతులు, పునరుద్ధరణ పనులవైపు మళ్లించాల్సి వస్తుందని ఉక్రెయిన్‌ భావిస్తున్నట్లు కథనం వివరిస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా ప్ర‌తి దాడి

మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్స్క్‌ ప్రాంతంలో నాలుగు జిల్లాలపై రాత్రివేళ జరిగిన దాడుల్లో ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్‌ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. శనివారం జపొరిజ్జియా ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో నలుగురు చిన్నారులు సహా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇంధన వ్యవస్థలు, డేటా కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతుండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.