Uk-Pm-Acused-Russia : బ్రెగ్జిట్ లో.. రష్యా ! Andhra Prabha Top News
Uk-Pm-Acused-Russia : బ్రెగ్జిట్ లో.. రష్యా ! Andhra Prabha Top News
- బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- ఫ్రాన్స్, జర్మనీల్లోనూ తప్పుడు ప్రచారం
- ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు మాస్కో కుట్రలు.
- విదేశీ జోక్యంపై అప్రమత్తం కావాలని హెచ్చరిక
(లండన్, ఆంధ్రప్రభ)
బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి రష్యా జోక్యం వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. 2016లో బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలా? వద్దా? అన్న అంశంపై జరిగిన చారిత్రక ప్రజాభిప్రాయ సేకరణ (బ్రెగ్జిట్ రెఫరెండం)లో రష్యా జోక్యం చేసుకుందని ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ వెల్లడించారు. విదేశీ శక్తులు ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయంలో బ్రిటన్ ఇప్పటివరకు తగినంత అప్రమత్తంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఫ్రాన్స్, జర్మనీల రాజకీయాల్లోనూ రష్యా నుంచి తప్పుడు సమాచార ప్రచారం సాగుతోందని ఆరోపించారు.
‘ది రెస్ట్ ఈజ్ పాలిటిక్స్’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్న్‌హామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని బాధ్యతలు చేపట్టి నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన తర్వాత.. 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుందా? అన్న అంశంపై అధికారులను వివరాలు అడిగినట్లు తెలిపారు. అందుకు ‘అవును.. జోక్యం జరిగింది’ అనే స్పష్టమైన సమాధానం వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఆ జోక్యం ఏ రూపంలో సాగింది? దాని పరిధి ఎంత? ఓటింగ్ ఫలితంపై దాని ప్రభావం ఏమిటి? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
‘మనం వెనుకబడిపోయాం’
విదేశాల నుంచి ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి ప్రజలకు తగినంత సమాచారం అందించడంలో బ్రిటన్ వెనుకబడిందని బర్న్‌హామ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యవస్థలను అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్న తీరును ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలను అందుకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలతో ఆయన వివరించలేదు. మరోవైపు, 2016లో బ్రిటన్ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చే ప్రచార సంస్థ ‘బ్రిటన్ అన్‌బౌండ్’ విమర్శించింది.
విదేశీ జోక్యం ఏ దేశ ఎన్నికల్లోనైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూనే.. 2016 ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాన్ని రష్యా ప్రభావితం చేసిందని నమ్మడానికి తగిన కారణాలు లేవని ఆ సంస్థ వాదించింది. ఓటర్లు అంత తేలిగ్గా మోసపోయారని చెప్పడం కూడా అవమానకరమని వ్యాఖ్యానించింది.
జర్మనీ, ఫ్రాన్స్‌లపైనా గురి?
రష్యా జోక్యంపై తాను జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో చర్చించినట్లు బర్న్‌హామ్ వెల్లడించారు. ఈ వారం ప్రారంభంలో జర్మనీ పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. జర్మనీ రాజకీయాల్లోకి రష్యా నుంచి తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారం చేరుతున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి పరిణామాలను బహిరంగంగా నమోదు చేయడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్, జర్మనీల ఓటర్లు తమ దేశాల్లో సాగుతున్న కొన్ని రాజకీయ ప్రచారాల వెనుక శత్రు దేశాల ప్రేరణ ఉండవచ్చనే అంశాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
రష్యా జోక్యం కేవలం ఎన్నికల ప్రక్రియకే పరిమితం కావడం లేదని, ప్రజల్లో భయాందోళనలు పెంచడం, రాజకీయ విభేదాలను మరింత తీవ్రం చేయడం, ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతోనూ తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయన్నది బ్రిటన్ ప్రభుత్వ ఆందోళనగా కనిపిస్తోంది.
2020 నివేదికలోనూ హెచ్చరికలు
బ్రిటన్ రాజకీయాల్లో రష్యా జోక్యంపై ఆందోళనలు ఇప్పటివి కావు. 2020లో పార్లమెంటు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ కమిటీ.. బ్రిటన్ ఎన్నికలు, ప్రజాభిప్రాయ సేకరణల్లో రష్యా జోక్యంపై నివేదిక విడుదల చేసింది.
అయితే, ఈయూ నుంచి వైదొలగాలన్న 2016 ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నించిందా? అనే అంశంపై ఆ నివేదిక నిర్దిష్ట నిర్ధారణకు రాలేదు. అదే సమయంలో, రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును పూర్తిస్థాయిలో అంచనా వేయడంలో, దానిని ఎదుర్కోవడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించింది.
ఈ నివేదికపై అప్పట్లో రష్యా విదేశాంగ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని ‘రష్యా వ్యతిరేక వైఖరి’గా అభివర్ణించారు. ఇతర దేశాల ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోదని క్రెమ్లిన్ ప్రతినిధి కూడా ప్రకటించారు.
అయితే, అదే ఏడాది అప్పటి కన్జర్వేటివ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 2019 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు రష్యా సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు ప్రయత్నించి ఉండటం ‘దాదాపు నిశ్చితమని’ పేర్కొంది.
ఏఐతో నకిలీ వార్తలు.. జర్నలిస్టుల పేరుతో మోసం
రష్యాతో సంబంధాలున్నట్లు భావిస్తున్న తప్పుడు సమాచార ప్రచారాలను బీబీసీ వెరిఫై పరిశీలిస్తోంది. జర్నలిస్టులు, వార్తా సంస్థల పేర్లను అనుకరిస్తూ కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నకిలీ వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్న ఉదంతాలను గుర్తించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ.. బ్రిటన్ రాజు చార్లెస్‌కు చెందిన ఓ భవనాన్ని రాయితీ ధరకు కొనుగోలు చేశారంటూ ఒక నకిలీ వార్తా వెబ్‌సైట్ తప్పుడు కథనాన్ని ప్రచారం చేసినట్లు బీబీసీ వెరిఫై వెల్లడించింది. ఇలాంటి ప్రచారాలు నిజమైన వార్తల రూపంలో కనిపించడం వల్ల ప్రజలు వాస్తవాలను గుర్తించడం కష్టతరమవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బ్రిటన్ ఎన్నికల సంఘం అధిపతి విజయ్ రంగరాజన్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఎంపీల ముందు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో రష్యా డీప్‌ఫేక్ వీడియోలు విస్తృతంగా ఉపయోగించినట్లు తెలిపారు. బ్రిటన్ మాత్రం ఇందుకు మినహాయింపు అవుతుందని భావించడానికి కారణం లేదని హెచ్చరించారు.
తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు కొత్త కేంద్రం
గత నెల ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన బర్న్‌హామ్.. అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి రష్యా సంస్థలు తమకున్న అన్ని మార్గాలనూ వినియోగిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల భయాలను ఆసరాగా చేసుకుని ప్రచారాలు సాగిస్తున్నాయని విమర్శించారు. ఈ విషప్రవాహాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
విదేశీ శక్తులు, వాటి అనుబంధ సంస్థల నుంచి ప్రజలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు. జాతీయ భద్రతా చట్టం ద్వారా ప్రభుత్వ అధికారాలను బలోపేతం చేయడం, కీలక మౌలిక సదుపాయాల రక్షణ, సరిహద్దుల భద్రత, పోలీసు-నిఘా వ్యవస్థల సామర్థ్యాలను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుందన్న తాజా ప్రకటన.. ఆ ఆరోపణలకు సంబంధించి కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చింది. విదేశీ జోక్యం జరిగిందన్న వాదన ఒకటైతే.. అది ఓటర్ల నిర్ణయాన్ని ఎంతవరకు ప్రభావితం చేసిందన్నది మరో కీలక అంశం. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంచేసే ఆధారాలు, అధికారిక విచారణల వివరాలు వెలుగులోకి వస్తేనే 2016 ప్రజాభిప్రాయ సేకరణపై రష్యా ప్రభావం ఎంతన్నది తేలనుంది.
