Uday Krishna Reddy Bail | 67 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ముగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసులో ఆయనకు ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో సుమారు 67 రోజులుగా కొనసాగుతున్న ఆయన జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ముగింపు పలికినట్లయింది.

శివరాంపల్లిలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. తనను ఇబ్బందులకు గురిచేశారని, వాట్సాప్‌ ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపారని, ఇతరుల సమక్షంలో తనను అవమానించేలా వ్యవహరించారని మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

జూలైలో కేసు నమోదు

ఫిర్యాదు అందుకున్న అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఉదయ్‌ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బెయిల్‌ మంజూరు కావడంతో ఉదయ్‌ కృష్ణారెడ్డికి కొంతకాలం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఏర్పడింది.