Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

కోహెడ, ఆంధ్ర‌ప్ర‌భ: సిద్దిపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మండల పరిధిలోని శనిగరం గ్రామ పంచాయతీ పరిధిలో గల శంకర్‌నగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, వారి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.