గొర్రెలను కడుగుతుండగా..
నీటి గుంతలో మునిగి ఇద్దరు మృతి!
ఒకరికి ఈత రాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికుల వెల్లడి
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
ధారూర్, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): గొర్రెలను కడిగేందుకు నీటి గుంతలోకి దిగిన ఇద్దరు గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషాద ఘటన తకిగోపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తకిగోపుల గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు తమ గొర్రెలను కడిగేందుకు గసుద్ద గుంత వద్దకు వెళ్లారు. తొలుత రెండు గొర్రెలను నీటిలోకి తీసుకెళ్లి కడుగుతుండగా, ఓ గొర్రె తప్పించుకుంది. దానిని పట్టుకునే క్రమంలో నక్కిల శ్రీనివాస్ నీటిలోకి వెళ్లాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ప్రమాదంలో చిక్కుకోగా, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
