UP| మోమోస్ తిన్న ఇద్దరు విద్యార్థులు మృతి..!
చిన్నారుల మృతిపై దర్యాప్తు
UP| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో మోమోస్ తిన్న ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను 12 ఏళ్ల నితిన్, 8 ఏళ్ల అరుణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు చట్నీతో కూడిన మోమోస్ తిన్న తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మోమోస్ లేదా వాటితో తీసుకున్న చట్నీ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విద్యార్థుల మృతికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థులు తిన్న ఆహార నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు సమాచారం. ఆహారం తయారు చేసిన విధానం, పదార్థాల నాణ్యతతో పాటు హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
