AP | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..

ఇసుక టిప్పర్ డీకొన్నట్లు ఆనవాళ్లు
కువైట్ లో ఇద్దరు భార్యలు
తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
న్యాయం చేయాలంటూ ప్రమాద స్థలంలో గ్రామస్థులు బైఠాయింపు


AP | సుండుపల్లె (వైఎస్సార్ కడప), జులై 22(ఆంధ్రప్రభ) : సుండుపల్లె.. రాజంపేట రహదారిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. సుండుపల్లె మండల పరిధిలోని చిన్నగొల్లపల్లెకు చెందిన రెడ్డిచర్ల రవీంద్ర (40),అబ్బన్నగారి జయరాం (45)లు ద్విచక్ర వాహనం పై బుధవారం ఉదయం ఐదు గంటల అనంతరం సుండుపల్లె లోని గొర్రెల సంతకోసం బయలుదేరారు. అయితే ఇంటి నుంచి బయలుదేరిన కొంత సేపటికే ఉప్పర పల్లె సమీపలో మామిడి తోటల వద్ద వెనుకనుంచి వచ్చిన వాహనం డీకొట్టడంతో పాటు సుమారు ఇరవై మీటర్ల దూరం వరకు వాహనం తో పాటు ఇద్దరిని ఈడ్చుకువెళ్లిన ఆనవాళ్లు వున్నాయి. దీంతో పాటు ప్రమాద స్థలం ముందు వెనుక బాగాలలో ఇసుక నీటి తేమ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అదేమార్గంలో ఆరు గంటల తరువాత సుండుపల్లె సంతకు బయలుదేరిన మృతుడు జయరాం సోదరుడు రాజన్న ప్రమాద స్థలంలో చూసి చనిపోయింది. తన తమ్ముడు, బంధువని నిర్ధారించుకుని ఫోన్ ద్వారా గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ప్రమాద స్థలానికి చేరుకున్న సుండుపల్లె ఎస్ఐ మహేష్ ప్రమాద స్థలంలో విగతజీవులుగా పడి వున్న రవీంద్ర, జయరాం మృతదేహాలను పరిశీలించి ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

తల్ల‌డిల్లిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో విగత జీవులైన రెడ్డిచర్ల రవీంద్ర, అబ్బన్న గారి జయరాంల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై తల్లడిల్లారు. మృతులు రవీంద్ర, జయరాంల భార్యలు సంపూర్ణ, ప్రభావతిలు గల్ఫ్ దేశమైన కువైట్ లో ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

న్యాయం కోసం బైఠాయింపు…
ఇసుక టిప్పర్ డికొట్టి తమ వారిని చంపేసిందని ఆరోపిస్తూ ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నగొల్లపల్లె గ్రామస్థులు ప్రమాద స్థలంలో మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించకుండా రోడ్డుపై బైఠాయించారు.

చప్పిడి సోదరుల పరామర్శ…
తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి మహేష్ నాయుడు, చప్పిడి రమేష్ నాయుడులు ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహలను సందర్శించారు. అనంతరం మహేష్ నాయుడు సుండుపల్లె ఎస్ఐ మహేష్ తో ప్రమాద కారకులను వెంటనే గుర్తించి అందుకు కారణమైన ఇసుక టిప్పర్ ను స్వాధీనం చేసుకోవాలని కోరారు. సుమారు నాలుగు గంటల అనంతరం భాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ వేణుగోపాల్, సిఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ మహేష్ లు టీడీపీ నేతలు మహేష్ నాయుడు, రమేష్ నాయుడుల సమక్షంలో హామీ ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు అనుమతించారు.

అంతకు ముందు రాజంపేట ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి ప్రమాద స్థలంలో మృతదేహలను సందర్శించి కొందరు వైసీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించగా ఇక్కడకు వచ్చి కనీసం కుటుంబ సభ్యులను పలుకరించకుండా శవ రాజకీయాలు చేయవద్దని, ఇది మంచి పద్ధతి కాదని టీడీపీ నేతలు, చిన్నగొల్లపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే ఆమరనాధరెడ్డి వద్దకు ఎస్ఐ మహేష్ వెళ్లి… ఇది పద్ధతి కాదని, మృతదేహాలు రోడ్డుపై వున్నాయి.. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు.