TVK | భారీగా ట్రోల్స్.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ రిప్లై
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సాధారణంగా శాసనసభ అంటే రాజకీయ చర్చలు, ప్రజా సమస్యలు, అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలు కనిపిస్తాయి. కానీ తమిళనాడు అసెంబ్లీలో మాత్రం మంగళవారం కాస్త భిన్నమైన దృశ్యం కనిపించింది. చేతుల్లో నవజాత శిశువుతో ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం* అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు.. తమిళనాడులో టీవీకే నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. పల్లవి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన చిన్నారిని వెంట తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
బిడ్డను వెంట తీసుకొచ్చిన ఎమ్మెల్యే
అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన పల్లవి.. తన నవజాత శిశువును కూడా వెంట తీసుకొచ్చారు. సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన హాలులోకి వెళ్లే సమయంలో బిడ్డను ఓ సహాయకురాలి సంరక్షణలో ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే సభలో ఉన్నంతసేపు ఆమె బిడ్డను అసెంబ్లీ హాలుకు సమీపంలోని ప్రత్యేక గదిలో సహాయకురాలు చూసుకున్నట్లు సమాచారం. సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత పల్లవి తిరిగి తన బిడ్డ వద్దకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
విజయ్ వద్దకు తీసుకెళ్లిన పల్లవి..
ఇటీవల కూడా పల్లవి తన బిడ్డను అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో టీవీకే వ్యవస్థాపకుడు, ఆ పార్టీ అధినేత అయిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వద్దకు చిన్నారిని తీసుకెళ్లగా.. ఆయన బిడ్డను ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారాయి. అయితే బిడ్డను ప్రతిచోటా వెంట తీసుకెళ్తూ హడావుడి చేస్తున్నారంటూ కొందరు విమర్శలు చేయడంతో పల్లవి స్పందించారు.
‘బిడ్డను ఇంట్లో ఎలా వదిలి వెళ్లాలి?’
తనపై వస్తున్న విమర్శలపై పల్లవి తీవ్రంగా స్పందించారు. **నవజాత శిశువును ఇంట్లో వదిలి తాను అసెంబ్లీకి ఎలా రాగలనని ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసం బిడ్డను వెంట తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. “హడావుడి సృష్టించడానికి ఏముంది? నేను నవజాత శిశువును ఇంట్లో ఎలా వదిలి వెళ్లగలను? దయచేసి ఆలోచించి వ్యాఖ్యానించండి. ఇతరుల బాధ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు.. కానీ ట్రోల్ చేయవద్దు” అని ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ పల్లవి పేర్కొన్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా..
2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పల్లవి చెన్నైలోని తిరు-వి-కా నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీవీకే నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా ఆమె గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో నవజాత శిశువుతో అసెంబ్లీకి వచ్చిన పల్లవి వ్యవహారం రాజకీయ అంశంగానే కాకుండా.. మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొనే వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలపై కూడా చర్చకు దారితీసింది.
